హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఒక్కరిని తొలగించినా.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. విధుల నుంచి తొలగిస్తే వాళ్లతోపాటు వారి కుటుంబాలూ రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మట్లాడారు. రాష్ట్రంలో సుమారు 1.20 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వారు రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా వాణిజ్య, రవాణా శాఖలతో పాటు కార్మిక శాఖలో వారి సంఖ్య అధికంగా ఉందని, వారి సేవల వల్లే ఆయా శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని గుర్తుచేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా.. ఉన్న ఉద్యోగులను తొలగించడమేమిటని ప్రశ్నించారు. ఛాయ్ తాగేలోపే జీవో ఇస్తామని చెప్పి.. ఇప్పుడు తొలగించడం ఏమిటని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ బకాయిలు పేరుకుపోయాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి తెచ్చింది అప్పులు కావని, తెలంగాణ అభివృద్ధి కోసం తెచ్చిన పెట్టుబడులని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. ఆ పెట్టుబడి నిధులతోనే గురుకులాలు, సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత తదితర పనులు చేపట్టినట్టు వివరించారు.