హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ‘మేము ఢిల్లీకి వస్తే మా పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా?’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని, ఇకనైనా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం ఆపాలని కొన్ని టీవీ చానళ్లకు హితవు పలికారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది.. ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసునని అన్నారు. ‘ఇద్దరు ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అకడితో ఆగిపోయిందా? ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లినంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదు’ అని చెప్పారు. ‘ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు. ఆ మార్పు కూడా శాశ్వతం కాదు’ అని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ బలహీనపడిందని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదని అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ గెలుచుకున్నామని తెలిపారు. ‘సూర్యచంద్రులు కిందమీదైనా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. మాకేంకాదు.. మేం ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటాం’ అని స్పష్టంచేశారు. నాడు ఎమ్మెల్యేలు ‘జై తెలంగాణ’ అని ఉచ్ఛరించడానికి భయపడిన రోజుల్లో నికార్సైన ఉద్యమకారులుగా తామే గొంతెత్తి నినదించినట్టు గుర్తుచేశారు. ఇప్పటికీ ఎప్పటికీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని, మీడియా ముసుగులో బట్టకాల్చి మీదెయ్యొద్దని, జర్నలిస్టులు విలువగల వ్యక్తులని, ఇలా పలుచన కావొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కర్ణాటకలోని సిర్సి పట్టణం వద్ద కొండచరియలు విరిగిపడి మృతిచెందిన ఏడుగురు గీత కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ ప్రధాని దేవెగౌడను శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఢిల్లీలో దేవెగౌడను కలుసుకున్న శ్రీనివాస్‌గౌడ్ మృతుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బాలరాజు గుత్తేదార్, పర్వానంద స్వామి, బాధిత కుటుంబసభ్యులు ఉన్నారు.