హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ) : సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉన్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలే కానీ, తొండలు, పేగులు అంటూ.. ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. గత ముఖ్యమంత్రులు పుచ్చలపల్లి సుందరయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి వాళ్లు ప్రజలతో ఏ విధంగా మాట్లాడారు? వారు ఎలా ఆదర్శవంతంగా నిలిచారో ఎప్పుడైనా గమనించావా? అంటూ ప్రశ్నించారు. సలహాదారుడు కే కేశవరావు లాంటి వాళ్లయినా సీఎం రేవంత్‌రెడ్డికి సలహాలు ఇవ్వాలని అని హితవుపలికారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
కేసీఆర్ పోరాడి తెలంగాణ తెస్తేనే కదా? రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారని, కేసీఆర్ తెలంగాణ తేకపోతే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని శ్రీనివాస్‌గౌడ్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన హయాంలో జైపాల్‌రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడే ఇంగ్లిష్ పదాలకు జర్నలిస్టులే డిక్షనరీలు వెతుక్కునే పరిస్థితి ఉండేదని, అంత అద్భుతంగా ఆయన మాట్లాడేవారని గుర్తుచేశారు. అలాంటిది కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ మాట్లాడుతున్న బూతులకు చాలామంది డిక్షనరీల్లో అర్థాలు వెతికినా, వాటికి అర్థాలు దొరకడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
భూమి ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, 3వ సారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం తథ్యం అని శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావాలి? అని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఉన్న ఆవేదన, ఆక్రోశం బుధవారం కోస్గిలో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన సభలో తేటతెల్లమైంది అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత ఇంట్లో తలుపు పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చి సర్పంచ్ల సభకు హాజరైనట్టుగా ఆయన వ్యవహారం ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి.. ఈ తొండల సోకు, లాగుల సోకు, పేగుల సోకు పట్టుకున్నదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని, పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై కేసీఆర్ ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా డైవర్టు చేసి, బూతులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా మహిళల వద్దకు వచ్చి మహాలక్ష్మీ పథకం రూ.2,500 వస్తున్నాయా అని అడగాలని ఆయన సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేబుల్లో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారని.. కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కొత్తగా అభివృద్ధి అమలు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టడానికే ప్రజలకు మీకు ఓట్లు వేశారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని తూర్పారపట్టారు. తమరినే లాగులో తొండలు తోలి రైతులు కొడతారు అని ఎదురుదాడి చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకే కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామానికైనా వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయా? లేదో? చూపించాలి అని సవాల్ చేశారు. ఒకవేళ నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఏకగ్రీవంగానే రేవంత్‌ను ఎమ్మెల్యే చేస్తా అని ఆయన చాలెంజ్ విసిరారు.
హామీలు అమలు చేయకుండా, కేసీఆర్‌ను తిట్టి కాలం గడపాలని చూస్తున్నారు అని విమర్శించారు. రేవంత్‌రెడ్డిని చూసి కొడంగల్ ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధిలో పోటీ పడ్డామే కానీ, ఎవరినీ దూషించలేదని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు భూ దందాలు, కమీషన్లలో పోటీ పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.