హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తేతెలంగాణ): ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారా..’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎగువన కర్ణాటక చెక్‌డ్యాంలు కడుతున్నా.. ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని, చేతగాని కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నదని నిప్పులు చెరిగారు. నిత్యం అబద్ధాలతో పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి తన 14 నెలల పాలనలో ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని నిలదీశారు. పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపిన కేసీఆర్‌ను బద్నాం చేయడం తప్ప సాధించిందేమీ లేదని విరుచుకుపడ్డారు.
తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. పాలమూరు నుంచి సీఎం అయితే జిల్లా దశ మారుతుందని అనుకున్నామని, కానీ మళ్లీ పాతరోజులు వస్తాయనుకోలేదని ఎద్దేవా చేశారు. చివరి దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకొనే నాథుడే లేకుండాపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోతే ఎందుకు మరమ్మతు చేయించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు బీఆర్ఎస్ను తిడితే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి చురకలంటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. రాజకీయాలను పక్కనబెట్టి కృష్ణా జలాలను కాపాడుకొనేందుకు పోరాటం చేయాలని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలోనే పాలమూరు జిల్లాకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే అంజయ్య తెలిపారు. రాజోలిబండ ద్వారా జిల్లా రైతాంగానికి నీరందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు కూడా ఈ విషయం తెలుసన్నారు. రాజకీయ కారణాలతో కేసీఆర్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని
తెలిపారు.
లక్ష కోట్లు కూడా వెచ్చించని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డదని కాంగ్రెస్ మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి ఆరోపణలు నిజమైతే గతేడాది 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎలా పండాయని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరిట కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చి కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌తో ప్రజలకు బతుకుదెరువు ఉంటే కాంగ్రెస్‌తో బర్బాద్ అయిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.