కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగాప్రారంభించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అప్పుడే అటకెక్కింది. 99 రోజుల మాట దేవుడెరుగు.. కేవలం రెండు రోజులకే పక్కన పడిపోయింది. ప్రారంభంలో హడావుడి చేసిన ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నిధులు లేని ఉత్తుత్తి కార్యక్రమంగా మిగిలిపోయింది. ఎమ్మెల్యేలతో పాటు అధికారులు సైతం ప్ర‘గతి’ లేని ప్రణాళిక వైపు కన్నెత్తి చూడని దుస్థితి దాపురించింది. గ్రామాల్లో రోజు వారీ నిర్వహించే పనులకే కార్యక్రమం పరిమితమైంది. తూతూ మంత్రంగా కొనసాగుతున్నది.
– హనుమకొండ, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది. మొదటి రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హడావుడి చేశారు. సమీక్షలు, అభివృద్ధి పనులను ప్రకటించారు. నిధుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు రోజుల తర్వాత కార్యక్రమం ఆగిపోయినట్లయ్యింది. మూడు నెలలపాటు గొప్ప కార్యక్రమం అని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులు లేక పక్కనపెట్టిన పరిస్థితి నెలకొన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలతోనే 99 రోజులపాటు ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమానికి అనధికారికంగా ముగింపు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులపై చేతులెత్తేయడం, సంక్షేమ పథకాల అమలులో అధ్వానంగా ఉండడంతో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నిధుల విడుదలపై స్పష్టత లేనప్పుడు ప్రణాళికలతో ఉపయోగం ఉండదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడా లేదు
‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా అమలు కావడంలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు శుభకార్యాలకు, సంతాప కార్యక్రమాలకు తప్పితే అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడంలేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ప్రస్తావన లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారు. ఎండాకాలం కావడంతో తాగునీరు, సాగునీటి సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రజల ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో యాసంగి పంటలకు నీళ్లు అందడంలేదు. చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరాపై అనేక ఫిర్యాదులున్నాయి. రెండేండ్లుగా గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల అమలు విషయంలోనూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. రైతు బంధు, మహిళలకు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపు వంటి విషయాల్లో ప్రజలు నిలదీసే పరిస్థితి ఉంది.
అప్పటిదే ప్రగతి..
గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసం లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టింది. ప్రతి నెల రూ.500 కోట్లు తగ్గకుండా విడుదల చేసింది. ఈ కార్యక్రమాలతో అన్ని ఊర్లు, పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చెందాయి. పరిశుభ్రత, పచ్చదనం నిరంతర ప్రక్రియగా కొనసాగాయి. తాగునీటి సరఫరా, రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలతో పాటు అన్ని రకాల మౌలిక వసతుల కల్పన జరిగింది. బీఆర్ఎస్ హయాంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మూడు, ఆరు నెలలకోసారి అధికారికంగా ప్రకటించి అమలు చేసినా.. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు నిరంతరాయంగా కొనసాగాయి. బీఆర్ఎస్ హయాంలో పల్లెల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి స్థాయిలో జరిగింది. పట్టణాల్లోనూ తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పన అత్యధిక ప్రాధాన్యతతో కొనసాగాయి. కాంగ్రెస్ హయాంలో అంతా తారుమారైంది. రెండేండ్లు గ్రామాలు, పట్టణాలను పట్టించుకోలేదు. నిధులు కూడా మంజూరు చేయలేదు. అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్భాటంగా ప్రకటించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులే పాల్గొనలేకపోతున్నారు.