హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాలు, ఇతర కారణాలతో 20 నెలల్లో దాదాపు 700 మంది కల్లుగీత కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇంతవరకూ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లేదు. దీన్నిబట్టే గౌడ కులస్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి గౌడల సమస్యలపై, ఇచ్చిన హామీలపై మట్లాడుతారని ఎదురుచూశామని, కానీ, వాటి ప్రస్తావనే తేలేదని, ఈ సమావేశంలోనూ కేసీఆర్ పేరెత్తకుండా ఉండలేక పోయారని పేర్కొన్నారు.
మద్యం షాపుల కేటాయింపుల్లో గౌడ సొసైటీలకు 20% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కూడా కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఎన్నికల్లో గౌడ కులస్థులకు కాంగ్రెస్ ఎన్నో హామీ ఇచ్చిందని, ఇప్పుడా హామీల అమలు గురించి ప్రశ్నిస్తే దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడుతామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 50% లోపు రిజర్వేషన్లకు చట్టం తెచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. వాస్తవంగా కేసీఆర్ 62శాతానికి మించి రిజర్వేషన్ల అమలుకు కృషి చేశారని తెలిపారు. దీనిని ఆనాడు కాంగ్రెస్ నేతలైన స్వప్నారెడ్డి, గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేసి, ఆ రిజర్వేషన్లను అమలు కాకుండా ఉండేందుకు కారకులయ్యారని మండిపడ్డారు. ఈ విష యంలో కాంగ్రెస్ నేతలు కారకులు కాదని, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీపై ఒట్టేసి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటేల్, గౌతంప్రసాద్ పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాకపోవడం వల్లే రేవంత్‌రెడ్డి.. నిత్యం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జపం చేస్తున్నారని మాజీ మం త్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఆయన రాత్రి నిద్రలో కూడా సీఎం కేసీఆర్‌ను కలువరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెస్తారో చెప్పకుండా, సంక్షేమ పథకాల అమలు ఊసే ఎత్తకుండా కాలం గడుపుతూ.. ప్రతి దానికీ కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని తూర్పారపట్టారు.