కాచిగూడ, డిసెంబర్ 26 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్(గోపా)ఆధ్వర్యంలో.. సంఘం స్వర్ణోత్సవాలను శుక్రవారం కాచిగూడలోని అంజయ్య హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైన్‌షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించామని, కులవృత్తి ఆత్మగౌరవం కోసం ట్యాంక్‌బండ్‌పై నీరా కేఫ్ ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో అవి మరుగున పడుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నూతి శ్రీకాంత్‌గౌడ్, చక్రవర్తి, అంబాల నారాయణగౌడ్, కిశోర్‌గౌడ్, పల్లె రవి, బాలరాజుగౌడ్, బండి సాయన్నగౌడ్, జీవీ శ్రీనివాస్‌గౌడ్, రఘునాథ్‌గౌడ్, రామ్మోహన్‌గౌడ్, మీరయ్యగౌడ్, శారదగౌడ్, రమేశ్‌గౌడ్, మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.