హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన నిర్వహించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎవరి వాటా ఎంతో తేలుద్దని స్పష్టంచేశారు. దేశ భవిష్యత్తు, బడుగు బలహీనవర్గాల భవిష్యత్తు మారాలంటే కేంద్రం కులగణన చేపట్టాల్సిందేనని పునరుద్ఘాటించారు.
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ హోటల్లో నిర్వహించిన ఓబీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో చాలా రాష్ట్రాల బీసీల రిజర్వేషన్ల బిల్లులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. బీసీల బిల్లులకు ఆమోదం తెలిపే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. సమావేశంలో తమిళనాడు తరహా రిజర్వేషన్లు కేటాయించాలని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని చర్చించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాష్ర్టాలకు చెందిన ఓబీసీ సంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.