హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాల్వలు తవ్వమంటే కాంగ్రెస్ నేతలు గతాన్ని తవ్వుతున్నారని, తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్టు వస్తాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఏ పనీ చేయలేదని అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని రైతులకు 100% రుణమాఫీ అయినట్టు 33 జిల్లాల కలెక్టర్లతో డిక్లరేషన్లు ఇప్పిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎఎస్ పోటీ చేయబోదని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు, పాలమూరు జిల్లా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏమిటి? అనే దానిపైనా చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికీ కేసీఆర్ ఘనతేని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని శ్రీనివాస్‌గౌడ్ హితవు పలికారు. పాలమూరు వెనకబడటానికి ఎకువ కాలం పాలించిన కాంగ్రెస్ నేతల పాపం కాదా? పాలమూరు నుంచి వలసలు తగ్గించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులను అనుమతి లేకుండా అక్రమంగా శరవేగంగా పూర్తిచేస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.