కాచిగూడ, మే 12 : సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు విద్యకు నోచడం లేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం జీవో-7ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలో మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జీవో కాపీలను శ్రీనివాస్‌గౌడ్ చింపివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో-7ను విరమించుకోకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12.50 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్నారని, రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో 17 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ఉదయ్, నందగోపాల్, రవీందర్, మాణిక్, తికల్సింగ్, వేణు తదితరులు పాల్గొన్నారు.