బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్‌ను తట్టుకునే సత్తా లేక సిట్ పేరుతో నోటీసులు జారీ చేశారని విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించిన మహోన్నత నేత కేసీఆర్‌నే విచారణకు పిలుస్తారా? అని మండిపడ్డారు. ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ సమాజాన్ని అవమానపర్చడమే అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. న్యాయస్థానాలపై గౌరవం ఉంది అని, ఎన్ని నోటీసులు ఇచ్చినా విచారణను సమర్థవంతంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
పదేండ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, సాధించిన రాష్ర్టానికి పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ‘సిట్’ పేరుతో నోటీసులు జారీ చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు.

అసలు ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కు సంబంధం ఏమిటి..? అని, ప్రజలను మభ్యపెట్టడానికే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక తప్పుడు కేసులు బనాయించి విచారణల పేరుతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే రేవంత్‌కు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం పనికిమాలిన చర్య అని విమర్శించారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్‌కు విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని పేర్కొన్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మచ్చలేని నాయకుడిపై కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి అని, కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.