హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత సింగరేణి సీఎండీ నడిమట్ల శ్రీధర్‌ను ఎంపిక చేశారు. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో శ్రీధర్‌ను ఎంపిక చేస్తూ.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ఆధ్వరంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్బీ) నిర్ణయం తీసుకొన్నది. నిరుడు డిసెంబర్లో ఎన్ఎండీసీ సీఎండీ పోస్టుకోసం పీఈఎస్బీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. దీనికి చాలా మంది ఉన్నతోద్యోగులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇందులో నుంచి ఏడుగురిని షార్ట్‌లిస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. వీరిలో అమితవ ముఖర్జీ, ఉషా సింగ్, రాకేశ్ తుమానె, రాజీవ్ సోనీ, సరోజ్ కాంతపాత్ర, అశోక్‌కుమార్ వర్మ, నడిమట్ల శ్రీధర్ ఉన్నారు. వీరందరినీ శనివారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేశారు. చివరికి శ్రీధర్‌ను రికమెండ్ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకొన్నది.
ఇదే విషయాన్ని తమ వెబ్సైట్లోనూ పొందుపర్చింది. పీఈఎస్బీ రికమెండేషన్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నది. అక్కడి నుంచి క్యాబినెట్ ద్వారా ప్రధాని వద్దకు ఈ ఫైలు చేరుతుందని సమాచారం. పీఎం సంతకం చేయడంతో అధికారికంగా అపాయింట్మెంట్ ఉత్తర్వులు వెలువడతాయి. తదనుగుణంగా ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్ఎండీసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఉన్నది. దేశంలోనే అత్యధిక ఐరన్ ఓర్‌ను వెలికితీసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీకి రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి తెలంగాణకు చెందిన (మెట్పల్లి స్వస్థలం) సీనియర్ ఐఏఎస్ అధికారి నియమితులు కావడం ఇదే మొదలు. ఎన్ఎండీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐదేండ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.
సింగరేణిపై తనదైన ముద్ర..
రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేలా శక్తిసామర్థ్యాలున్న ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను సీఎండీగా సీఎం కేసీఆర్ నియమించారు. 2015 జనవరి 1న సీఎండీ బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్.. సింగరేణిని లాభాల బాటలో పయనించేలా తీర్చిదిద్దారు. ఎనిమిదేండ్లలో సింగరేణి టర్నోవర్‌ను సుమారు 200 శాతం పెంచారు. సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీధర్ వినూత్న ప్రణాళికలతో కార్మికుల మన్ననలు చూరగొన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను 1,200 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకొచ్చి తెలంగాణ విద్యుత్తు అవసరాలకు అండగా ఉండేలా తీర్చిదిద్దారు. మరో 800 మెగావాట్ల మూడో యూనిట్ నిర్మాణ ప్రణాళికను రచించి అమలుకు సిద్ధంగా ఉంచారు. దేశంలోనే అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో అగ్రస్థానానికి చేర్చారు. సౌర విద్యుత్తు రంగంలోనూ విజయవంతంగా ప్రణాళికను అమలు చేశారు.
ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని సింగరేణికి దక్కేలా చూసి.. దానిని వచ్చే నెలలో ప్రారంభించేలా చర్యలు తీసుకొన్నారు. సత్తుపల్లి, రామకృష్ణాపురం రైల్వే లైన్లను వేగంగా నిర్మించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఎనిమిందేండ్లలో సుమారు 19,500 భారీ రిక్రూట్మెంట్లను విజయవంతంగా చేయగలిగారు. కార్మికుల సంక్షేమానికి సీఎండీగా శ్రీధర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కరోనా లాంటి కష్టసమయాల్లోనూ కార్మికులకు అండదండలందించారు. సింగరేణి పరిధిలోని దవాఖానలను బలోపేతం చేశారు. సంస్థలో సమ్మెలను పూర్తిగా నివారించడంలోనూ సీఎండీ పాత్ర ఎంతో ఉన్నది.