కుత్బుల్లాపూర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చింతల్లోని శ్రీచైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. పాఠశాల భవనం మూడో అం తస్థులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి, తలుపులు వేసి వెళ్లారు. లోపల గాలి మొత్తం ఘాటైన వాసనతో నిండిపోయింది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బాత్రూమ్కు వెళ్లగా తలుపులు తీయగానే ఒక్కసారిగా ఘాటైన వాసన రావడంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వీరిని పాఠశాల నిర్వాహకులు సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఏమై నా జరిగితే ఎవరు బాధ్యులు అంటూ తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.