మహబూబ్‌నగర్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు కండ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదేకాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధే జరుగలేదని గురువారం జడ్చర్లలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో ప్రజలకు సాగు, తాగు నీటిని అందించి వలసలు వాపస్ వచ్చేలా చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటుచేసి యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాన్ని ఎందుకు లేదని నిలదీశారు.
పేద వర్గాలను, కులాలను రేవంత్‌రెడ్డి అడుగడుగునా అవమానిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బడుగులను అవమానించటమే కాంగ్రెస్ విధానమా? అని నిలదీశారు. పిచ్చగుంట్ల సామాజిక వర్గాన్ని రేవంత్‌రెడ్డి దూషించటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.