హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల పాలనలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సాహంతోనే బాడ్మింటన్‌లో గోపీచంద్, టెన్నిస్‌లో సానియామీర్జా, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, క్రికెట్లో సిరాజ్, షూటింగ్లో సాధుల మేఘన, ఆకుల శ్రీజ తదితరులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటినట్టు గుర్తుచేశారు. మంగళవారం కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడాపాలన బిల్లు-2025, ఉత్ప్రేరకాల నిరోధక బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు మద్దతు ప్రకటించారు.
అనంతరం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలను జీవితంలో భాగం చేయడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, బలహీనవర్గాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం శుభపరిణామన్నారు. కేసీఆర్ పాలనలో రూ. 400 కోట్లు కేటాయించి 33 జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకర్గాల్లో స్టేడియాలు నిర్మించినట్టు తెలిపారు. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 2,161 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ.17 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బిల్లులతో క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని ఆ శాభావం వ్యక్తంచేశారు. నిధుల కేటాయింపు లో తెలంగాణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.