Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాత కాలంలో పిల్లలు అన్నం తినకుంటే బయటకి తీసుకెళ్లి తినిపించేవారు కానీ నేడు పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఇచ్చి తినిపిస్తున్నారని అన్నారు. చేతిలో మొబైల్ ఇచ్చి నోట్ల అన్నం బుక్క పెడుతున్నారు.. దీంతో తల్లి కొడుకులు సంతోషంగా ఉంటున్నారని.. ఇలాంటి పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో ఎంతో ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు కూడా చాలా అవసరమని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఎంత చదివి ఉన్నత ఉద్యోగాలు ఉంటే ఏ లాభం ఆరోగ్యం బాగా లేకుంటే అని అన్నారు. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు ఉన్న యువతకే ఎక్కువ శాతం గుండెపోటు లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన నిమిషంలో మనిషి చనిపోతున్నాడని అన్నారు. పాతకాలంలో 100 సంవత్సరాలు కూడా ఎలాంటి రోగాలు లేకుండా బతికారని.. కానీ ఈ కాలంలో 50 సంవత్సరాల లోపే చనిపోతున్నారని అన్నారు. దీన్నంటికీ కారణం వాకింగ్, వ్యాయామం, యోగ లాంటి లేకపోవడమే అని అభిప్రాయపడ్డారు.
చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతే అని హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్యం మన చేతిలో నుంచి ఒక్కసారి జారిపోతే మనం ఏమి చేయలేకపోతామని తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇకనైనా ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం, యోగా లాంటివి చేయాలని సూచించారు. స్వచ్ఛ సిద్దిపేట కోసం మోరీలను తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధానాన్ని తీసుకొచ్చానని తెలిపారు. మంచి రోడ్లు వేసి.. ప్రతిరోజు శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి గల్లీలో మొక్కలు నాటి సంరక్షించాం ఇలా తన వంతుగా ఎంత చేయాలో ప్రజల ఆరోగ్యం కోసం అంత చేశానని అన్నారు. ఇంగ్లీష్ వచ్చిన వారు ప్రపంచంలో ఏ దేశంలో వెళ్లిన జీవిస్తారని తెలిపారు. ఉర్దూను కూడా మరిచిపోవద్దని సూచించారు. మాతృభాషను నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదే అని అన్నారు. నేటి కాలంలో ఉర్దూ పేపర్ చదువమంటే విద్యార్థులు చదవలేకపోతున్నారని అన్నారు. తెలుగుతోపాటు ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యార్థులు చదువుకోవాలని సూచించారు.
ఉదయం నుంచి సాయంత్రం పిల్లలను స్కూలుకు పంపిస్తారో సాయంత్రం వేళల్లో సైతం అదేవిధంగా గ్రౌండ్ కు తీసుకెళ్లి ఆటలు ఆడిపించాలని తల్లిదండ్రులకు హరీశ్‌రావు సూచించారు. పిల్లలు ఏ ఆటను ఎంచుకుంటారో ఆ ఆటను తప్పనిసరిగా ఆడించాలని అన్నారు. ఫోన్, లాప్టాప్ లాంటి వాటితో దూరంగా పెట్టి మంచి సంస్కారాన్ని నేర్పాలన్నారు.