హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మొన్నటివరకూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో రాష్ట్ర పార్టీ అధినేత మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్నది. ఈసారి పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారు? ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తారు? అసలు మార్పు ఎప్పుడు జరుగుతుంది? అన్న దానిపై ఎవరికి వారు ఊహాగానాలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సాధారణంగా పార్టీ బాధ్యతలను ఒకరికి, ప్రభుత్వ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారు.
ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని అధిష్ఠానం కూడా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎప్పుడు మారుస్తారు అన్నదానిపై మాత్రం స్పష్టత రాలేదు. పీసీసీ అధ్యక్షుడి మార్పు ఎప్పుడు జరిగినా.. ఆ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. కానీ తమకే పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరికొంత మంది కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
సీఎం పదవి ఎవరికివ్వాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం పదవిని రేవంత్‌రెడ్డికి ఇస్తే.. తనకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే దీనిపై ఆయనకు అధిష్టానం నుంచి ఏ మేరకు హామీ దక్కిందనేది ప్రశ్నార్థకమే. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలను మరొకరి చేతిలో పెట్టేందుకు అధిష్ఠానం సాహసిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం. అదే నిజమైతే మరో ఆరు లేదా ఏడు నెలల వరకు పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చు.