వరంగల్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఎవర్ విక్టోరియస్ పోలీస్’ ఇది వరంగల్ పోలీసులు తమకు తాము సృష్టించుకున్న నినాదం. కొంతమంది పో లీసుల అతి, అత్యుత్సాహం వల్ల అది మసకబారుతున్నది. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీస్ ట్యాగ్‌లైన్ కాస్త ‘లీడర్ ఫ్రెండ్లీ’ పోలీస్‌గా రూపాంతరం చెందిందనే అపవాదును మూటగట్టుకున్నదనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల కనుసైగతో ఠాణాలను రచ్చబండలుగా మార్చి ప్రజలను ఏమార్చుతున్నారనే ఆరోపణలు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. తక్కిన సమయాల్లో కంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం నిక్కచ్చిగా ఉంటూ చట్టాన్ని అత్యంత నిష్ఠతో అమలు చేస్తారని విశ్వాసం ఉంది.
మహాత్మాగాంధీ జాతిపిత. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని అహింస అనే ఆయుధాన్ని ధరించి నడిపాడని ప్రపంచమే కీర్తిస్తున్న క్రమంలో యావత్‌దేశం ఆయన జయంతి సందర్భంగా జంతు బలిని నిషేధ దినంగా, మద్యరహిత దినంగా పాటిస్తున్నది. ఎక్కడైనా ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట వ్యతిరేక మనే ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఈసారి గాంధీ జయంతి, దసరా రెండూ ఒకే రోజు రావడం ఎవరినీ ఆపతరం కానీ సందర్భమే. అయితే, చట్టాలను పకడ్బందీగా అమలు చేసే పోలీసులే వాటిని అతిక్రమించడమే కాకుండా దగ్గరుండీ ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యకమవుతున్నాయి.
గాంధీ జయంతి, దసరా రెండూ ఒకేరోజు రావడంతో ఒకవైపు విశ్వాసం.. మరోవైపు చట్టం అనే మీ మాంస డోలాయమానంలోకి పోలీసులను నెట్టినా.. దసరా సందర్భంగా ఏమీ చేసినా బారాఖూన్ మాఫ్ కాదని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంటారు. ఈ క్రమంలోనే గురువారం నర్సంపేటలో జరిగిన జంతుబలికి ప్రత్యక్షసాక్షి కమ్ ప్రోత్సా హి రెండూ పాత్రల్ని ఒక సీఐ పోషించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మరోవైపు ఇదే నర్సంపేట సబ్ డివిజన్ పరిధిలో చంద్రు గొండలో నెక్కొండ ఎస్సై దాదాపు ఇదే పాత్ర పోషించారని వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వరంగల్ నగర పొలీసు కమిషనర్ ‘విచారణ జరుగుతుంది’ అని ప్రకటించారు.
గాంధీ జయంతి సందర్భంగా నర్సంపేటలో చోటుచేసుకున్న జంతుబలి ఘటనపై వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర పోలీసులు బందోబస్తు కోసం వెళ్లిన సమయంలో జంతుబలి జరిగిందని, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, చంద్రుగొండ ఉదంతంపైనా విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
నర్సంపేట సబ్ డివిజన్లో దసరా సందర్భంగా చోటు చేసుకున్న రెండు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నర్సంపేట సీఐ, నెక్కొండ ఎస్సై ఇద్దరి ప్రత్యక్ష పర్యవేక్షణలో జంతుబలి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో దసరా చేయడం అంటే యాట కొట్టడం అనే ఆనవాయితీ చట్ట ప్రకారం నిషేధమే అయినా అనధికారికంగా కొనసాగుతున్నది. దసరా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు పోలీసులు తీసుకోవడం పరిపాటి. అయితే, గాంధీ జయంతి సందర్భంగా అటువంటి ఆనవాయితీని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రోత్స హించొద్దు అని చట్టం చెబుతున్నా చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రెండు చోట్లా వాటిని అతిక్రమించ డంపై విమర్శలు వస్తున్నాయి.
గాంధీ జయంతి నాడు జంతువులను బలి చేయడం, మాంస, మద్యపాన విక్రయం చట్ట విరుద్ధం. నేరం. కానీ, అవేమీ పట్టని నర్సంపేట టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, నెక్కొండ మండలం చంద్రుగొండలో ఎస్సై మహేందర్ వాటినేమీ పట్టించుకోకుండా వ్యవహరించిన ఉదంతం పోలీసుల ‘అతి’క్రమణకు సాక్ష్యాలుగా నిలిచాయి. అయితే, నర్సంపేట సీఐ ఉదంతం గురువారమే దేశవ్యాప్తంగా వైరల్‌కాగా, శుక్రవారం సాయంత్రం నెక్కొండ ఎస్సైది వెలుగు చూడడం గమనార్హం.