మంచిర్యాల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం.. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంపై ఉత్కంఠ నెలకొన్నది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ చేసిన తీర్మానం గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉండగా, ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు ప్రభుత్వమే జీవో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది.
ఎన్నికలకు పది రోజులు ఆగాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్ల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కోర్టు విచారణ అనంతరం ఎన్నికలపై ప్రభుత్వం ముందుకెళ్తుందని అంతా భావించారు. కానీ, కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో 8న కోర్టు ఏం తీర్పు ఇస్తుంది.. మొన్న చేసిన రిజర్వేషన్లు ఉంటాయా… మారుతాయా…. అన్న ఆందోళన నెలకొన్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్ర స్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో.. ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే ఉన్న 27 శాతం కలిపితే రిజర్వేషన్లు 69 శాతం దాటిపోతున్నాయి. రా జ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. 2018లో అప్పుడున్న బీఆర్ఎస్ సర్కారు బీసీల రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతో పాత రిజర్వేషన్లను అనుసరించే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెంచిన రిజర్వేషన్లకు కోర్టు బ్రేకులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కోర్టు తీర్పును మరో తేదీకి వాయిదా వేస్తే తుది తీర్పు వచ్చే దాకా ప్రభుత్వం ఎదురుచూడక తప్పదు. ఒకవేళ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ఎన్నికలకు వెళ్తే.. ఆ ఎన్నికలను సైతం కోర్టు రద్దు చేయొచ్చు. అంత దూరం తీసుకురావడం కంటే తుది తీర్పు వెలువడే వరకూ వేచి చూడడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపు సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారడం తప్పనిసరిగా కనిపిస్తున్నది. అదే జరిగితే అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చాయంటూ సంబురపడుతున్న ఆశావహుల ఆశలు అడియాసలు కానున్నాయి.
రిజర్వేషన్ల ఖరారు.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నేపథ్యంలో గ్రామాలు, మండల స్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొత్తగా ఖరారైన రిజర్వేషన్లను అనుసరించి ఆశావాహులు చాలా మంది అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి తామే అభ్యర్థులమనే ప్రచారం చేసుకుంటున్నారు. సర్పంచ్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు, జడ్పీటీసీ ఎవరు అంటూ జనాల్లో చర్చ మొదలైంది. ఎవరెవరు బరిలో ఉంటున్నారు.. ఎవరు గెలిచే అవకాశాలున్నాయి. అన్న అంశాలపై జోరుగా చర్చ నడుస్తున్నది. రిజర్వేషన్లు ఖరారవడంతో ప్రతి స్థానానికి ఒక్కో పార్టీ నుంచి నలుగురైదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరి పంథాలో వారు రాజకీయం మొదలుపెట్టారు. సద్దుల బతుకమ్మ.. దసరా పండుగల్లో రాజకీయ ఉనికి చాటుకునే దిశగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కాగా, ఈ రిజర్వేషన్లు ఉంటాయా.. ఉండవా అన్న దానిపై స్పష్టత లేకపోవడం ఆశావాహులకు ఇబ్బందిగా మారింది. ఓ వైపు తాము బరిలో ఉంటామనే సంకేతాలు ఇస్తూనే.. ఖర్చుల విషయంలో చాలా మంది ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. దీంతో ఈ నెల 8వ తేదీన కోర్టు ఏం చెబుతుంది అన్నది కీలకంగా మారింది. కోర్టు బీసీ రిజర్వేషన్లపై అనుకూలంగా స్పందించాలని కొందరు, పాత రిజర్వేషన్లకే కొనసాగించేలా తీర్పు ఇవ్వాలని మరికొందరు కోరుకుంటున్నారు. దీంతో కోర్టు ఏం చెబుతుందో అన్న ఆసక్తి ఆశావాహుల్లో ఎక్కువైపోయింది.
రిజర్వేషన్ల కేటాయింపు ఎలా ఉంటుందన్నది పక్కనపెడితే… ఉమ్మడి జిల్లాలో వేమనపల్లి, నెన్నెల, దస్తురాబాద్, ఖనాపూర్, తాంసి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం కేటాయించిన రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. అసలు ఎస్సీ జనాభా లేని గ్రామాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడం, బీసీలే లేని గ్రామాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆయా గ్రామాల వాసులు నిరసనలు, ఆందోళనలకు చేపట్టారు. తమ గ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్లు మార్చాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు మార్చక తప్పనిపరిస్థితి నెలకొంది. కోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకునే పరిణామాలకు అనుకూలంగా ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లను మార్చడం అనివార్యం కానున్నది. మొత్తం రిజర్వేషన్లు మార్చాల్సి వస్తే అప్పుడైనా తమ గ్రామాలకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.