టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్).. హైదరాబాద్ రియల్ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న టీడీఆర్ సర్టిఫికెట్లను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి నయా దందాకు తెరలేపారు.
ముఖ్యనేత అనుచరుడు, పేరొందిన బిల్డర్ కనుసన్నల్లో ఈ బ్లాక్ దందా సాగుతున్నదన్న ప్రచారం జరుగుతున్నది. మార్కెట్లో ఉన్న కోట్ల రూపాయల టీడీఆర్‌లను తమ ఆధీనంలోకి తీసుకుని వీటినే రియల్ మార్కెట్‌గా మార్చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్కో టీడీఆర్‌పై 22 శాతంతో దొరికిన సర్టిఫికెట్ ఇప్పుడు 55 నుంచి 60 శాతం వరకు వెళ్లడం గమనార్హం. కొత్త టీడీఆర్‌లను జీహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయడం, ఒకటి, రెండు జారీచేసినా అవి పెద్దలవే కావడంతో టీడీఆర్ సర్టిఫికెట్లను పొందడం చిన్నపాటి బిల్డర్లకు సవాల్‌గా మారింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 22 నెలల పాలనలో కుదేలైన నిర్మాణ రంగానికి టీడీఆర్‌ల బ్లాక్ దందా మింగుడు పడటం లేదు. రియల్ భూం పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక డీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ‘మూలిగే నక్కపై తాటిపండు’ చందంగా వ్యవహరిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నదని బిల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ప్రోత్సాహకాలు లేకపోగా భూ బాధితులు, రియల్ వ్యాపారులకు మేలు జరిగే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయొద్దంటూ తాజాగా సర్కారు నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే గతంలో మాది
రిగా జీహెచ్ఎంసీ టీడీఆర్‌ల దరఖాస్తులను పరిశీలించడం లేదంటూ ప్లానింగ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వందల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్‌లు నిలిచిపోయి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా, అందుబాటులో ఉన్న టీడీఆర్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకొన్నది.
కృత్రిమ కొరత వెనుక పెద్దల హస్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 37. 32 లక్షల చదరపు గజాల టీడీఆర్ సర్టిఫికెట్లు జారీచేశారు. వీటిలో రూ. 20 లక్షల చదరపు గజాలకు సంబంధించి టీడీఆర్‌లను వినియోగించుకున్నారు. ఇంకా 15.36 లక్షల చదరపు గజాల టీడీఆర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్‌లను బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో విక్రయించి నయా దందాలకు పాల్పడుతున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి చేతిలో ఉన్న టీడీఆర్‌ను డిమాండ్‌కు తగ్గట్టుగా రేటు నిర్ణయించి అమ్మకాలు జరుపుతుండటంతో టీడీఆర్ కొనుగోలు అందరికీ సాధ్యం కావడం లేదన్నది అక్షరసత్యం. కనీసం చిన్నా చితక నిర్మాణాలు చేపడదామంటే టీడీఆర్‌లు బ్లాక్‌లో పెట్టారంటూ బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం డిమాండ్, సైప్లె ఆధారంగా రేట్లు ఉంటాయని చెప్తున్నారు. డిమాండ్‌కు గల కారణాలను విశ్లేషిస్తే సాధ్యం కాని చోట టీడీఆర్ సర్టిఫికెట్ చేతిలో ఉంటే అదనంగా రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టే వీలు ఉంటుంది. అధికారులు మాత్రం యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్ రూల్స్ వస్తాయన్న కారణాలతో టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ ( ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జీహెచ్ఎంసీలో నిలిపి వేశారు. ప్రస్తుతం టీడీఆర్‌కు సంబంధించి ఓటీపీ, ఆన్లైన్ సర్వర్ పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా టీడీఆర్‌లు ఇవ్వడంలో కమిషనర్ ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడు ఒకటి, రెండు జారీ అయిన సర్టిఫికెట్లు సైతం ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే జరుగుతున్నాయని బిల్డర్లు పేర్కొంటున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భూమి కోల్పోయిన వారికి సైతం టీడీఆర్ అందుకోవడం సవాల్‌గా మారింది. టీడీఆర్ దరఖాస్తులకు సంబంధించి కిందిస్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు పంపినా ఏదో కారణంతో తిరస్కరణకు గురై వెనక్కి పంపిస్తుండటం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం చేపట్టే భూ సేకరణ, ఆస్తుల సేకరణ సందర్భంగా జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలను అందజేస్తున్నారు. అభివృద్ధి పనులకు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ఈ టీడీఆర్‌ను ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ వల్ల ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లకు టీడీఆర్ పత్రాలను పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు ఆమీర్పేటలో రహదారి విస్తరణలో 20 గజాల స్థలాన్ని కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు.
టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడుతున్నారు. ఎక్కువ శాతం అదనపు అంతస్తు కంటే భవన నిర్మాణం పూర్తయ్యాక తీసుకునే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ(ఓసీ) సమయంలో కాంపౌండింగ్ ఫీ చెల్లింపునకు వినియోగించుకుంటున్నారు.