జూబ్లీహిల్స్, అక్టోబర్ 3: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాగిరీ తీవ్రమవుతుండటంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది. హస్తం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య రాజకీయాలకు సామాన్యులను బలి చేస్తున్నారని పలు బస్తీల వాసులు మండిపడుతున్నారు. రహ్మత్‌నగర్‌లో నెలకొన్న అరాచక పరిస్థితులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శమని చెప్తున్నారు. మంగళవారం రహ్మత్‌నగర్‌లో మంత్రి వివేక్ నిర్వహించిన సభలో గందరగోళం, అనంతరం జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని వెల్లడిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రహ్మత్‌నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి.
కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, స్థానికుడైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి ఇరువర్గాల మధ్య కుమ్ములాటలు పరిపాటిగా మారిపోయాయి. ఇద్దరు నేతల మధ్య పోటీ, రెండు వర్గాల కార్యకర్తల మధ్య కొట్లాటలు జూబ్లీహిల్స్‌లో రౌడీయిజానికి దారితీస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బ్రహ్మశంకర్‌నగర్‌లో మంత్రి వివేక్ ఓ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొన్న వారి పట్ల వెంకటస్వామి అక్కసు వెళ్లగక్కినట్టు తెలిసింది.
వేదిక వద్దనే పలువురిపై వెంకటస్వామి దాడికి పాల్పడటంతో సమావేశం రసాభాసగా మారింది. బస్తీ నాయకుడు అడివయ్యను వెంకటస్వామి పక్కకు నెట్టేశాడు. తన తండ్రి పట్ల ఎందుకు దౌర్జన్యంగా వ్యవహరించావని అడివయ్య కూతురు ఈశ్వరమ్మ నిలదీశారు. మంత్రి వివేక్ సమక్షంలోనే తనను నిలదీసినందుకు వెంకటస్వామి ఆగ్రహంతో రగిలిపోయాడు. సభ ముగిసిన తర్వాత వెంకటస్వామి అనుచరులతో కలిసి ఈశ్వరమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. ఈశ్వరమ్మపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఈశ్వరమ్మ కూతురు మైనర్ బాలికపైనా విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వెంకటస్వామిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన రజిత అనే మహిళను కూడా చితకబాదాడు. స్థానికులు, బస్తీ నాయకులు అప్రమత్తం కావడంతో వెంకటస్వామి తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాడిలో గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల నాయకులు పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమను వివస్త్రలను చేసి విచక్షణ రహితంగా కొట్టారని బస్తీల నాయకులకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వెంకటస్వామి, అనుచరుల దాడిలో ఈశ్వరమ్మ, రజిత, బాలిక తీవ్రంగా గాయపడ్డారని బస్తీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నా యకుల అంతర్గత కుమ్ములాటలు ప్రజల పాలిట శాపంగా మారాయని చెప్పారు. అనంతరం మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజులైనా పోలీసులు బాధితుల వద్దకు రాలేదని, దాడి గురించి ఆరా తీయలేదని బస్తీ నాయకులు మండిపడుతున్నారు. మహిళలపై దాడికి పాల్పడ్డ వెంకటస్వామిని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణయేతరుడైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామిని పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.