హైదరాబాద్,అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన ఈ వాయుగుండం గంటకు 15 కి.మీ. వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలి అక్కడే కేంద్రీకృతమై ఉన్నదని అధికారులు తెలిపారు.
ఇది ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు.
గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచినట్టు వెల్లడించారు. ఈ నెల 7న రాష్ట్రంలోని కు మ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మె దక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.