హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ప్రచారంపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. ఇప్పుడు తాజాగా సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడిపై కొన్ని వలస కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు వ్యతిరేక ప్రచారం చేస్తుండటం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మహేశ్‌కుమార్‌గౌడ్‌పై గతంలో ఎన్నడూలేనివిధంగా కాంగ్రె స్ పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డికి సత్సంబంధాలున్న ఒక న్యూస్ చానల్లో వరుసగా వ్యతిరేక కథనాలు రావడం వెనుక పెద్ద కథే నడుస్తున్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో పార్టీకి కండ్లు, చెవులుగా ఉండే పీసీసీ అధ్యక్షుడినే టార్గెట్ చేస్తే, ఇక రాష్ట్రం నుంచి పార్టీ అధిష్ఠానానికి తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరని పార్టీలోని ఒక వర్గం భావిస్తున్నది. అవకాశం దొరికినప్పుడల్లా తమ అనుకూల మీడియా, సోషల్‌మీడియాల్లో పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేక వార్తలను వండివారుస్తున్నారు. అంతేకాకుండా, పార్టీ, ప్రభుత్వంలో పీసీసీ నుంచి వచ్చే రికమండేషన్లను పట్టించుకోవద్దని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీచేసినట్టు చెప్తున్నారు.
ఇద్దరి మధ్య కోల్డ్‌వార్
పీసీసీ అధ్యక్షుడికి, ప్రభుత్వంలోని ముఖ్యనేతకు మధ్య పొసగడంలేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. ఇద్దరూ బయటకు బాగానే ఉన్నట్టు కనిపించినా, ఇటీవల కొన్ని విషయాల్లో ఇద్దరికీ పొరపొచ్చాలు వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇటీవల పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై పీసీసీ అధ్యక్షుడి ద్వారా నివేదిక కోరినట్టు తెలిసింది. దీంతో పార్టీ స్థితిగతుల గురించి ఆయన తన నివేదికలో వివరించినట్టు సమాచారం. ఆ నివేదిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని, పలు వివాదాస్పద విధానాలపై ఆయన కూలంకశంగానే వివరించినట్టు ప్రచారం జరుగుతున్నది. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా ఆయన సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ వ్యవహారం కాంగ్రెస్‌కు నష్టం చేసిందని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం, భగీరథ్‌ను పట్టుకొనేందుకు వారం రోజులపాటు ఆలస్యం చేయడం వల్ల బీజేపీ మంత్రికి సహకరించినట్టుగా ప్రజల్లో జరుగుతున్న చర్చను కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. దీంతోపాటు ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యం, ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ వారిని పక్కకుపెట్టి వలస కాంగ్రెస్ వారికి పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలను సమర్థించేలా మహేశ్‌కుమార్‌గౌడ్ నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ కూడా పార్టీ, ప్రభుత్వంపై పలు నివేదికలను పార్టీ అధిష్ఠానానికి ఇచ్చారని, ఇవన్నీ ఇక్కడి కొంతమంది నేతలకు నచ్చడంలేదని సమాచారం. ముఖ్యంగా వలస కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, అసలు కాంగ్రెస్ వారిని అణచివేసేలా ప్రయత్నిస్తున్నారన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
మీడియాలో కథనాల వెనుక?
సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా ఉండే ఒక మీడియాలో మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పలు కథనాలు శుక్రవారం ప్రసారం కావడం దుమారం రేపుతున్నది. పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలను ఆ చానల్ ఇవ్వడం, వాటి ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలోని ఒకవర్గం సోషల్‌మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టడం వెనుక రాష్ట్రంలోని ముఖ్యనేత వర్గం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. మహేశ్‌కుమార్‌గౌడ్‌పై ఆరోపణలు వస్తే కాంగ్రెస్ పార్టీలోని వలస కాంగ్రెస్ నేతలెవ్వరూ కనీసం ఖండించలేదు. దీంతో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మద్దతుగా పలు బీసీ కులసంఘాలు ప్రెస్మీట్లు పెట్టాయి. ప్రెస్మీట్లు పెట్టినవారు కూడా కథనాల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌లో ముఖ్యనేత వర్గమే చేయిస్తున్నదని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది ; నాపై కల్పిత కథనాలు ప్రసారం చేస్తున్నారు న్యూస్ చానల్ కథనంపై మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒకరు కూడా ఆందోళన చెందకుండా, ఆవేశానికి గురికాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయంతో ఉండాలని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి దగ్గరగా ఉండే పలు మీడియా చానల్స్‌లో తనపై వస్తున్న వ్యతిరేక కథనాలపై ఆయన శుక్రవారం స్పందించారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పార్టీ కాంగ్రెస్ అని, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని, తన పనితీరును నిర్ణయించాల్సింది క్యాడర్ అని చెప్పారు. మీడియా కథనాలు మన పనితీరును కుంగదీయలేవని క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒకరు కూడా ఆందోళన చెందకుండా, ఆవేశానికి గురి కాకుండా ఓపికగా, ప్రశాంతంగా, సమన్వయంతో ఉండాలని కోరారు.అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.