Revanth Reddy | అసలే కాంగ్రెస్.. అందులో చంద్రబాబు అంశ చేరింది! ఇంకేముంది.. అసలే కోతి.. ఆపై కల్లుతాగింది అన్నట్టు తయారైంది పరిస్థితి.
ఒకరోజు.. ప్రగతి భవన్ కూల్చేస్తాం
రెండోరోజు.. సచివాలయాన్ని పేల్చేస్తాం
మరో రోజు.. ధరణిని రద్దు చేస్తాం
ఇంకో రోజు.. రైతుబంధును కుదిస్తాం
తర్వాతి రోజు.. కాళేశ్వరాన్ని ఆపేస్తం
తాజాగా… ఉచిత విద్యుత్తు తీసేస్తం
పీసీసీ అధ్యక్షుడిగా మారిన చంద్రబాబు చేలా.. రేవంత్‌రెడ్డి నోట వరుసగా వెలువడుతున్న విధ్వంస విద్వేష వాఖ్యలివి.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు వ్యవసాయాన్ని దండగ అని రైతులపై పోలీసు కాల్పులు జరిపించిన చంద్రబాబు శిష్యుడి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం! రేవంత్ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే 24 గంటల కరెంటును వ్యతి రేకించారు. సీఎం కేసీఆర్ అప్పుడే సభలోనే ఆయనకు చురకలు వేశారు. అదే రేవంత్ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడయ్యారు.
ఆమాటకొస్తే కాంగ్రెస్ కూడా తక్కువేమీ తినలేదు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదని 2018లోనే తీర్మానించింది. 9 గంటలిస్తే చాలని అప్పుడు కాంగ్రెస్ నేతలు పేర్కొంటే ఇప్పుడు కుప్పిగంతుల రేవంత్ వచ్చి దాన్ని ముచ్చటగా మూడు గంటలు చాలని ముక్తాయించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు లేక రైతులు అర్ధరాత్రి మోటరు పెట్టడానికి పోయి, బాయిలకాడ పండుకొని పాముకాట్లకు గురై చనిపోయిన విషాద సన్నివేశాలు మరువకముందే రైతు పథకాల రద్దుతో కాంగ్రెస్ తాజా ఎన్నికల ప్రణాళికను రచిస్తున్నది.
రైతన్నలారా…గతం గుర్తున్నదా? గమనిస్తున్నరా!!
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు’అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించారు. అమెరికా తానా సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నారైలతో మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణలో 95 శాతం 3 ఎకరాలలోపు భూమి గల చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒక రైతుకు మూడెకరాల భూమి ఉంటే.. ఆ రైతు ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట సమయం పడుతుంది. ఇలా మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది. అంతేగానీ 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు. అందుకే ఉచితాలను ఇష్టారీతిన అనుచితంగా ఇవ్వొద్దు’ అంటూ తన నిజ స్వరూపాన్ని బయపెట్టుకొన్నారు. రైతులకు నిరంతరాయ కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్‌పై తన కుల్లును బయటపెట్టారు. రాష్ట్రంలో మళ్లీ నాటి టీడీపీ పాలన రావాలని రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పారు.
ఉమ్మడి ఏపీలో టీడీపీ పాలనలో రేవంత్ చెప్పిన విధంగానే రైతులకు మూడు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రైతులు చస్తున్నా సరే.. వారికి మేలు చేసేందుకు నాటి సీఎం చంద్రబాబుకు చేతులొచ్చేవి కావు. ఇప్పుడు అచ్చంగా రేవంత్‌రెడ్డి కూడా అదే తరహా ఆలోచన చేస్తూ తెలంగాణ రైతులను మళ్లీ అంధరకారంలోకి నెట్టే కుట్ర చేస్తున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యాలపై తెలంగాణ ప్రజలు, రైతులు మండిపడ్డారు. వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు.
రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై విషం చిమ్మడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఉచిత విద్యుత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. సీఎం కేసీఆర్ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కరెంట్ గండంనుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా పంట ఉత్పత్తులు పెరిగి రైతులు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఇది చూసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఉచిత విద్యుత్‌ను బంద్ చేయించి, రైతులను మళ్లీ కష్టాల్లోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నారు. ఆదినుంచీ ఉచిత విద్యుత్‌ను ఆపేసేందుకు కుట్రలు చేస్తూనే ఉన్నారనే విమర్శలున్నాయి.
గతంలోనూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగానే ఉచిత విద్యుత్‌పై విషం కక్కారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పథకం అవసరం లేదంటూ బాహాటంగా ప్రకటించేశారు. కానీ రేవంత్ పిచ్చి కూతలకు అదే అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆయనకు 24 గంటల కరెంట్ వద్దంట. అయితే ఆయన ఒక్కడి పొలానికి 24 కరెంట్ బంద్ చేస్తాం. ఓ వైపు 24 గంటల కరెంట్ ఇవ్వడంపై యావత్తు ప్రపంచం, దేశం పొగుడుతుంటే, పంట ఉత్పత్తులు పెరుగుతుంటే ఈయనేమో ఉచిత విద్యుత్ వద్దంటున్నడు. ఉచిత విద్యుత్తుతో రైతుల దర్జాగా కాలుమీద కాలేసుకొని పంటలు పండించుకుంటున్నరు. కాబట్టి ఎవరో మాట్లాడారని 24 కరెంట్‌ను బంద్ చేయం. 100 శాతం 24 గంటల కరెంట్‌ను రాష్ట్రంలో కొనసాగిస్తాం. అన్ని రంగాలకు విద్యుత్తును అందిస్తాం.’ అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.
సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. నెలల తరబడి మేధోమథనం చేసి.. రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే ఎవరూ ఊహించని విధంగా ఎన్నో ఏండ్లుగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు చరమగీతం పాడారు. అయితే, దీనిపై నాటినుంచే కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతున్నది. 2018లో గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవసాయానికి 9 గంటల కరెంటు చాలని తీర్మానించారు. చిన్న, సన్నకారు రైతుల్లో ఐదెకరాల్లోపు ఉన్నవారే 90 శాతం ఉన్నారని, వారికి 24 గంటల కరెంటు అవసరం లేదని, 9 గంటలు ఇస్తే చాలని నిర్ణయించారు. నాడు వ్యవసాయానికి 9 గంటల కరెంటు చాలన్న ఆ పార్టే ఇప్పుడు 3 గంటలే మస్తు అంటూ యావత్తు తెలంగాణ రైతాంగాన్ని అవమానించింది.
ప్రగతిభవన్‌ను కూల్చేస్తాం
సచివాలయాన్ని పేల్చేస్తాం
ధరణిని రద్దు చేస్తాం
రైతుబంధును కుదిస్తాం
‘కాళేశ్వరాన్ని’ ఆపేస్తాం..
24 గంటల ఉచిత విద్యుత్‌ను బంద్ చేస్తాం.
వ్యవసాయానికి 3 గంటలే కరెంట్ ఇస్తాం..
ఇదీ… ప్రజా, రైతు సంక్షేమ పథకాలపై కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ విధ్వంసకాండ. నిన్న మొన్నటి వరకు ధరణి, కాళేశ్వరంపై ధ్వంస రచనను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా 24 గంటల ఉచిత విద్యుత్‌పై తన విధ్వంస రచనకు అంకురార్పణ చేసింది. అన్నదాతకు మేలు చేసే ఉచిత విద్యుత్‌పై విషం కక్కుతున్నది. హస్తం పాలనలో తెలంగాణ రైతులు అరిగోసపడ్డారు. కరెంట్ కోసం రాత్రిపూట బాయిలకాడే మంచా లు వేసుకొని పడుకొన్నారు. విషపురుగుల బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అప్పులబాధతో ఆత్మహత్యలు చేసుకొన్నారు. అయినా.. పట్టనట్టు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ పాలనలో అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అం దకుండా చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ కుట్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే బట్టబయలు చేశారు.
కరెంట్ విషయంలో రేవంత్‌రెడ్డి మాట్లాడింది చాలా తప్పు. ఆయనకు వ్యవసాయం మీద అవగాహన లేదు. కరెంట్‌తో గంటలో ఎకరం పొలం పారిస్తమని చెప్పుడు ఆయన మూర్ఖత్వం. గంటలో ఎకరం పొలం ఆయన పారిచ్చి చూపిస్తడా? అవగాహన లేకుంట మాట్లాడుతున్నడు. పుష్కలంగా నీళ్లున్న బోరుకు బిగించిన 3 హెచ్‌పీ మోటర్ 5 నుంచి 6 గంటలు నడిస్తేనే దుక్కి దున్నేతందుకు పొతం అయితది. నాటేసిన తర్వాత ఎకరం పొలం పారాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటలు పడుతది. కుష్కి పంటలకైతే ఎకరం తడుపాలంటే 3 గంటలు పడుతది.
– మంద తిరుపతి, రైతు, కరీంనగర్ జిల్లా