హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఈత, తాటి వనాలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గౌడ సోదరులు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈత, తాటి చెట్లే గీత కార్మికుల జీవనాధారమని, వాటి సంరక్షణ ప్రతి ఒకరి బాధ్యత అని తెలిపారు. ఇటీవల జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామం, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు ప్రాంతాల్లో ఈత వనాలు పూర్తిగా కాలిపోయి గౌడ కుటుంబాలకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో గీత కార్మికులు చెట్ల సంరక్షణ చేపట్టాలని, చెట్లకు నీరు పట్టడం, ఎండు చెత్త తొలగించడం తదితర చర్యలు తీసుకుంటే ప్రమాదాలను బాగా తగ్గించవచ్చని తెలిపారు. ఎకడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణపై గీత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు సూచించినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు.