Harish Rao | కటిక చీకట్లోనూ కారుదీపం లాంటిది కాళేశ్వరం అని హరీశ్‌రావు తెలిపారు. ఎంత కరవు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అవుతుందని అన్నారు.
సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ నీటి సౌలభ్యతను తక్కువ చేసి మాట్లాడకండి అని హితవు పలికారు. జలహారతి అంటూ డ్రామాలు తప్ప కాంగ్రెస్‌లో నిజాయితీ లేదని విమర్శించారు. ఆనాడు ఏడున్నరేళ్లు.. ఈనాడు రెండున్నరేళ్లు కాంగ్రెస్ డ్రామాలు చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ మరమ్మతు చేసి సాగు, తాగు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
నాలుగేళ్లలో ప్రాణహితను పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. 2024-25 బడ్జెట్లో ప్రాణహితకు రూ.2కోట్లు కేటాయించారని హరీశ్‌రావు తెలిపారు. 2025-26 బడ్జెట్లో ప్రాణహితకు రూ.30కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రాణహిత చేవెళ్లకు పెట్టింది రూ.50కోట్లు అని అన్నారు. తిప్పి తిప్పి రూ.84 కోట్లే కేటాయించారని.. వీటితో ప్రాణహిత పూర్తవుతందా అని ప్రశ్నించారు. నిజంగానే కట్టే ఆలోచన ఉంటే బడ్జెట్లో నిధులు పెంచాలి కదా అని నిలదీశారు.
ప్రాణహితకు సంబంధించి రూ.11వేల కోట్ల పనులు పూర్తయ్యాయని నిన్న రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ హయాంలో భూసేకరణ, పనునలకు అయిన ఖర్చు రూ.3708 కోట్లు అని తెలిపారు. రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్ధాలకూ హద్దూ పద్దూ ఉండాలని అన్నారు. ఆనాడు జలయజ్ఞం కాదు.. ధన యజ్ఞం అన్న రేవంత్ ఇవాళ గొప్పలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఊసరవెల్లిలా రేవంత్ రెడ్డి రంగులు మారుస్తున్నాడని మండిపడ్డారు. 30 నెలలుగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లను మరమ్మతు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుటెండల్లోనూ 6400 క్యూసెక్కుల నీరు పోతుందని అన్నారు. మేడిగడ్డ మరమ్మతు చేస్తే కేసీఆర్‌కు పేరొస్తదని తమ్మడిహట్టి అంశం తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు.