Palamuru Lift | కల్వకుర్తి, మార్చి 22 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచే సాగునీళ్లు పారించాలని పాలమూరు అధ్యయన వేదికలో వక్తలు కోరారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని టీయూటీఎఫ్ భవనంలో పాలమూరు అధ్యయన వేదిక, కల్వకుర్తి జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ఇరిగేషన్ నిపుణులు కేవీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
పార్టీలకతీతంగా హాజరైన పలువురు.. జలదోపిడీపై ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీటి విషయంలో మొదటి నుంచి మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నదని అన్నారు. 1956 ఉమ్మడి ఏపీ ఏర్పాటుతోనే ఈ ప్రాంతానికి అన్యాయం ప్రారంభమైందని తెలిపారు. కండ్ల ముందే మనకు దక్కాల్సిన సాగునీటిని నల్లగొండ జిల్లాకు తరలించుకుపోతుంటే అడ్డుకోవాల్సిన జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఇకపై అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలదేనని వారు స్పష్టం చేశారు. పాలమూరు లిఫ్ట్ నుంచి నల్లగొండకు సాగునీరు ఇవ్వొద్దని సూచించారు. పాలమూరు పథకం నుంచి సాగునీరు తరలింపును అడ్డుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.