బాన్సువాడ, ఆగస్టు 8: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. అక్కడి ప్రజలకు కనీసం తినడానికి బియ్యం కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, పేదలకు బియ్యం పంపిణీ చేయడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులెత్తేశారని ఆరోపించారు. అదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో, పాలనదక్షతతో కార్మిక, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని స్పీకర్ పేర్కొన్నారు. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని, దేశంలో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. స్పీకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్నదని చెప్పారు. రాష్ట్ర సంపదను పెంచి రైతులు, పేదలు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు పంచాలన్నదే సీఎం సంకల్పం అని తెలిపారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రాష్ట్రంలోని సుమారు 43 వేలకు పైగా కార్మికులను ఉద్యోగులుగా గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆర్టీసీలో పనిచేసే వారంతా కార్మికులు కాదని.. ప్రభుత్వ ఉద్యోగులని చెప్పారు.