కామారెడ్డి : దేశానికి అన్నం పెట్టేది రైతులు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ గ్రామీణ మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..మన రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా లేవన్నారు.
అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నదని స్పష్టం చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టులో ఈ వానకాలం రైతులు సాగు చేస్తున్న వరి పంటకు సాగునీటికి ఇబ్బంది లేదన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు లోని 5 TMC లకు తోడుగా అవసరమైన మరో 5 TMC లను సింగూరు లేదా కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి అందిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డిఅంజిరెడ్డి, బాన్సువాడ మండలాధ్యక్షురాలు దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, ZPTC పద్మా గోపాల్ రెడ్డి, బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.