హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ‘నాకే వినబుద్ధవడంలేదు. మీరెట్ల వింటున్నారు?’ అని గౌరవ స్పీకర్ అనడం తనను బాధించిందని పేర్కొన్నారు. సోమవారం చర్చలో తానేం తప్పుచేశానని స్పీకర్‌ను ప్రశ్నించారు. తాను సబ్జెక్టు తప్ప పరిధి దాటి నడుచుకోలేదని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టంచేశారు. ఇదే సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులెందరో మహిళా సభ్యులమైన తమ పట్ల అన్ పార్లమెంటరీ భాష మాట్లాడినా, తాము సభలో నిలబడి మౌనంగా నిరసన వ్యక్తంచేశామే తప్ప ఎక్కడా అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పారు.
మంత్రిగా పనిచేసి, సీనియర్ శాసనసభ్యురాలిగా కొనసాగుతున్నానని, కొత్త ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలిచ్చే తన పట్ల స్పీకర్ మాట్లాడిన వ్యాఖ్యలు అత్యంత బాధించాయని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎవరితోనూ మాట పడలేదని, ఎవరితోనూ అనిపించుకోలేదని చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా క్రమశిక్షణతో, విధేయురాలిగా పనిచేశానని తెలిపారు. పార్టీ అవకాశం ఇస్తే, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చానని స్పష్టంచేశారు. తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి తప్ప మరే విషయం మాట్లాడలేదని, తాను మాట్లాడేది బాగా లేకపోతే అధికారపక్షం అభ్యంతరం వ్యక్తంచేయాల్సి ఉండెనని పేర్కొన్నారు. ‘ప్రొటోకాల్ ఉల్లంఘనపై నేను ఫిర్యాదు చేస్తే, కలెక్టర్‌ను పిలిచి స్పీకర్‌గా మీరే విచారించారు. ఈ సభ అందరిది. ఇలాంటిది సభా సంప్రదాయాలకు మంచిదికాదు. సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభాపతిదే. నన్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సబబుగా అనిపిస్తే రికార్డుల్లో ఉంచండి, లేదంటే తొలగించండి’ అంటూ స్పీకర్‌ను సునీతా లక్ష్మారెడ్డి కోరారు.
మీ మనసుకు బాధేస్తే ఉపసంహరించుకుంటున్నా: స్పీకర్
సునీతాలక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సభలో స్పందించారు. సునీతాలక్ష్మారెడ్డి మనసును బాధించి ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని స్పీకర్ సభలో ప్రకటించారు. తనకు ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారని, తనకు మహిళలన్నా, సునీతాలక్ష్మారెడ్డి అన్నా ఎనలేని గౌరవమని చెప్పారు. సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేయడంతో ‘నాకే వినబడటంలేదు. మీకు వినబడుతున్నదా?’ అన్న కోణంలోనే అన్నానే తప్ప తనకు మరే దురుద్దేశం లేదని చెప్పారు. రన్నింగ్ కామెంటరీ నేపథ్యంలోనే తాను అలా స్పందించాల్సి వచ్చిందని స్పీకర్ వివరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
సునీతా లక్ష్మారెడ్డికి మైక్ ఇవ్వండి
మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని ఆ పార్టీ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. స్పీకర్ డిమాండ్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మంత్రులు వాటిపై మాట్లాడుతున్నంతసేపూ అసెంబ్లీలో మైక్ కోసం బీఆర్ఎస్ పక్షం మౌనంగా నిరసన తెలిపింది. అనంతరం స్పీకర్ సునీతా లక్ష్మారెడ్డికి మైక్ ఇవ్వడంతో ఆమె తన ఆవేదన వ్యక్తంచేశారు.