హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభ మొత్తం 9 రోజులు.. 65.33 గంటల పాటు నిర్వహించారు. రెండు అంశాలపై లఘు చర్చ నిర్వహించగా ఐదు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు.
ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఒక అంశంపై మంత్రి ప్రకటన చేశారు. 32 ప్రశ్నలకు సభలో, 8 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. శాసనసభలో మంత్రులు 23.47 గంటల పాటు ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి 4.54 గంటలు, కాంగ్రెస్ సభ్యులు 12.45 గంటలు, బీఆర్ఎస్ సభ్యులు 12.57 గంటల పాటు మాట్లాడారు.
బీజేపీ సభ్యులు 5.55 గంటలు, ఎంఐఎం సభ్యులు 7.34 గంటలు, సీపీఐ సభ్యుడు 2.35 గంటల పాటు ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పద్దులను గిలిటెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పద్దులపై చర్చించడానికి కేవలం 2 రోజులే కేటాయించటంతో ప్రతిపక్ష సభ్యులు పూర్తిగా మాట్లాడకుండా, మంత్రులు సమాధానం ఇవ్వకుండానే గిలిటెన్ చేశారు.
ప్రతిపక్ష సభ్యులను అధికార పార్టీ సభ్యులు, మంత్రులు పదేపదే లక్ష్యంగా చేసుకొని సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ప్రధాన అంశాలను చర్చించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారని ఆరోపించారు. సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ సహా బీజేపీ డిమాండ్ చేశాయి. 9 రోజుల పాటే సభను నిర్వహించి వాయిదా వేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
రైతులు, నిరుద్యోగుల సమస్యలపై చర్చ జరగకుండానే వాయిదా వేశారని విమర్శిస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై చర్చించకుండానే వాయిదా వేశారని విమర్శిస్తున్నారు. అటు.. శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదాపడింది. ఈ మేరకు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.
మండలి జూలై 24న ప్రారంభమైంది. ఆరు రోజులు .. 20 గంటల పాటు సభ జరిగింది. ఐదు బిల్లులను మండలి ఆమోదించింది. 45 మంది సభ్యులు మాట్లాడారు. 9 ప్రశ్నలకు సభలో, 5 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రులు 5.30 గంటలు, కాంగ్రెస్ సభ్యులు 3.37 గంటలు, బీఆర్ఎస్ 6.24 గంటలు, బీజేపీ 43 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 38 నిమిషాలు మాట్లాడారు.