Akhilesh Yadav | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్, హరీశ్‌రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో సమావేశం అవుతారన్నారు. హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్‌కు తాము స్వాగతం పలికుతామంటే స్వయంగా వచ్చి కలుస్తానన్నాని, చర్చిస్తానన్నారు. కేసీఆర్ ఇంటికి వచ్చి తమ సమయం గడిపి ఆతిథ్యం స్వీకరించారన్నారు. తమతో సమయం గడిపినందుకు అఖిలేష్ యాదవ్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
గతంలో శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో తక్కువ సీట్లు సాధించినా.. ప్రజల వెంబటి నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. అఖిలేష్ పార్టీ స్ఫూర్తితో భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతామన్నారు. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామన్నారు. అఖిలేష్ యాదవ్ పార్టీ 2024లో 37 మంది ఎంపీలతో ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు.. తాము కూడా సమాజ్ వాదీ పార్టీ నుంచి స్ఫూర్తి పొందుతామన్నారు. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతామని.. మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారు.

అనంతరం అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా, సొంత మనిషిలా అనిపిస్తుందన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కలిశానని.. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పుడూ గౌరవంతో స్వాగతం పలికారన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయని.. రాజకీయాల్లో ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారని.. మరోసారి మన విషయాలను పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారన్నారు. తాము మాట్లాడుకున్న సమయంలో ఇదే అంశంపై చర్చించామన్నారు.
ఒకప్పుడు తాము తక్కువ సీట్లు గెలిచామని.. కానీ అదే ప్రజలు మళ్లీ తమ వెంట నిలిచారన్నారు. అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉందని.. మనం ప్రజల వెంట నిలబడినప్పుడు ఏదో ఒక రోజు ప్రజలే మన పార్టీల వెంట నిలబడతారని, అండగా ఉంటారన్నారు. తెలంగాణలోనూ పరిస్థితులు మారుతాయని ప్రజలు మారుతారని ఆశిస్తున్నామని.. దేశం ప్రగతిశీల మార్గంలో వెళ్లే అవసరం ఉందన్నారు. ఒక విజన్‌తో ముందుకు వెళ్లాలని.. విభజన రాజకీయాలు అంతం కావాలన్నారు. రాజకీయాల్లో ప్రతికూలత పోవాలని, సానుకూల మాటలు ఉండాలన్నారు. సానుకూలత రావాలని, ప్రగతి గురించి చర్చ జరగాలన్నారు. అదే దిశలో పని చేయడానికి తమ ప్రయత్నం ఉంటుందన్నారు. కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. త్వరలోనే వచ్చి ఆయనను కలుస్తానన్నారు.