హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు శనివారం ఉదయం కేరళ తీరాన్ని తాకా యి. సాధారణంగా జూన్1న ప్రవేశించే రుతుపవనాలు జూలై 8న నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈఏడు మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించాయ ని భారత వాతావారణశాఖ అధికారులు శనివారం ప్రకటనలో వెల్లడించారు. 16ఏండ్ల (2009) తర్వాత కంటే ముందే వచ్చాయని తెలిపారు. 25ఏండ్లలో 2001, 2009లో నిర్దేశిత సమయానికి ముందే.. అంటే మే 24 నే కేరళ తీరానికి చేరాయని పేర్కొన్నారు. 1918లో అత్యంత వేగంగా మే11న కేరళను తాకడమే ఇప్పటి వరకు రికార్డు అని వెల్లడించారు. 1972లో అత్యంత ఆలస్యంగా జూన్ 18న కేరళలోకి ప్రవేశించాయని తెలిపారు.
2023లో మే 30న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2009లో జూన్ 8న, 2018లో మే 29న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని వివరించారు. మరోవైపు అరేబి యా సముద్రంలో దక్షిణ్ కొంకణ్ తీరానికి సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. అల్పపీడనం కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జూన్1లోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశమున్నట్టు వివరించారు.
ఈ ఏడు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినట్టు కేరళ ఏరియా ఐఎండీ డైరెక్టర్ నీతా కే గోపాల్ పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలు, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లో మొత్తంగా, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని అనేకచోట్ల రుతుపవనాలు విస్తరించాయని తెలియజేశారు. సెప్టెంబర్ 17నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమై.. అక్టోబర్ 15నాటికి ఉపసంహరణ పూర్తవుతుందన్నారు.