హైదరాబాద్ : తెలంగాణలోకి రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవానలు కేరళలోకి ముందుగానే ప్రశించినప్పటికీ విస్తరించడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు వాతావరణం అనుకూలంగా ఉందని, ఇప్పటికే కేరళ, తమిళనాడులో పూర్తిస్థాయిలో విస్తరించాయని చెప్పారు. కర్నాటకలో కొంత భాగం విస్తరించాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే రెండు మూడు రోజుల్లోకి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు.
అయితే, ఆదివారం తీవ్రంగా వడగాలులు వీయడంతో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్, కుముర్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో 40 కంటే తక్కువగా నమోదు కాగా.. నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.
అత్యధికంగా నల్లగొండ జిల్లా నాంపల్లి 6.35 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) 6.08, నల్లగొండ జిల్లా వెలుగు పల్లె 5.80, నాగర్ కర్నూల్ జిల్లా ఎంగంపల్లి 5.58 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల10 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.