హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ కింద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న రైతులతో దక్షిణ డిస్కమ్ ఆటలాడుతున్నది. సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)పై రైతులతో సంతకాలు చేయించుకున్న డిస్కమ్ వాటి ప్రతులను ఇవ్వకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను కలిస్తే డివిజనల్ ఇంజినీర్(డీఈ), చీఫ్ ఇంజినీర్ (సీఈ)లేదంటే డైరెక్టర్‌ను కలవండి.. అని సమాధానం ఇస్తూ తప్పించుకుంటున్నట్టు వాపోతున్నారు.
పీఎం కుసుమ్ కింద రైతుల భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 1,450 మెగావాట్ల ప్లాంట్లకు అనుమతులు ఇవ్వగా, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లతో పీపీఏలు కుదుర్చుకోవాల్సి ఉన్నది. ఇంతవరకు బాగానే ఉన్న అన్నదాతలకు అసలు కష్టాలు ఇక్కడే మొదలయ్యాయి. 60 ఏండ్లు నిండిన వారికి సిబిల్ స్కోర్ లేక బ్యాంకు రుణాలు రాకపోవడం, స్థలం డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవడంతో సుమారు 70 మంది రైతులు పీపీఏలు చేసుకోలేకపోయారు.
ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీలోగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ డిస్కమ్ అధికారులు ఒత్తిడి పెంచడంతో సుమారు 60-70 మంది అన్నదాతలు పీపీఏలపై సంతకాలు చేసినా, వారికి మాత్రం ఒప్పంద పత్రాలు ఇవ్వలేదు. 25 ఏండ్లు ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రూ.3.19 చొప్పున డిస్కమ్‌లు కొనుగోలు చేయడంతో పాటు పూర్తి వివరాలతో కూడిన పీపీఏ ప్రతిని ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా డిస్కమ్ అధికారులు పీపీఏ నకలును తమకు అందజేయాలని కోరుతున్నారు.