హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఆలయాల నిర్వహణ, ఆస్తులు కాపాడే బాధ్యత నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు అధికారులు దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. అలయానికి వస్తున్న ఆదాయంతో పాటు భక్తులు ఇచ్చే కానుకలను కొట్టేస్తున్నారు. ఇలాంటి 12 మంది అధికారులపై దేవాదాయశాఖ అంతర్గత విచారణ జరుపుతున్నట్టు తెలుస్తున్నది. విచారణ జరుపుతున్న అధికారులపైనా రాజకీయ ఒత్తిళ్లు చేస్తున్నారని సమాచారం. వరంగల్ నగర సరిహద్దులో జాతీయరహదారిపై ఓ ఆలయం ఉంది.
అక్కడ గతంలో పనిచేసిన ఈవో హయా ంలో బ్యాంకు ద్వారా నగదు ఉపసంహరణ, ఖర్చులు, దాతలు ఇచ్చిన వెండి మాయం కావడం వంటి ఆరోపణలు వచ్చాయి. వీటిపై దేవాదాయశాఖ విచారణకు ఆదేశించింది. సదరు ఈవోనే ప్రస్తు తం ఓరుగల్లుకు ఇలవేల్పు అయిన అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నారు. అక్కడ కూడా పలు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఒకసినీ ప్రముఖుడు అమ్మవారి ఆలయానికి విరాళం ఇచ్చిన సొమ్ము సదరు ఈవో సొంత ఖాతాలోకి మళ్లించినట్టు సమాచారం. ఆలయంలో జరిగే పలు ఉత్సవాల్లోనూ చేతివాటం కనబర్చడంతోపాటు కుటుంబసభ్యుల ఖర్చు కూడా ఆలయం ఆదాయం నుంచే వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ప్రధాన శక్తి దేవాలయమది. అక్కడ పనిచేస్తున్న ఈవోకు స్థానికంగా ఉండే అధికార పార్టీ నేత అండదండలు మెండుగా ఉన్నాయి. ఆయన తనకు ఉన్న ఆలయాల్లో ప్రధానంగా ఈ ఆలయం నుంచే ఆదాయం అధికంగా పొందుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అమ్మవారి చీరలకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడినట్లుగా దేవాదాయశాఖకు ఫిర్యాదులందాయి. ఆలయం దగ్గర కట్టిన వసతి గృహాల సముదాయానికి సంబంధించి రూ.30లక్షలు దుర్వినియోగమైనట్టు దేవాదాయశాఖ అధికారులు తేల్చినా ఎలాంటి ఫలితమూ లేదు.
జనగామ జిల్లాలో ఉన్న ప్రధాన దేవాలయమది. ఈ దేవాలయ ఈవో మరో రెండు దేవాలయాలకు కూడా కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. తన పరిధిలో ఉన్న ఒక దేవాలయంలో టెండర్లకు సంబంధించి హైదరాబాద్‌లో ధర్మకర్తలతో సమావేశం పెట్టడంపై ఆరోపణలు వచ్చాయి. సమావేశానికి వచ్చిన ధర్మకర్తలకు తన ఫోన్‌పే నుంచి డబ్బులు పంపించారు. ఇలా చాలాసార్లు మూడు దేవాలయాలకు సంబంధించి సొంత వ్యవహారంలా చూస్తున్నారని దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
ప్రధానఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలకు దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వస్తుంటాయి. ఇవి నేరుగా దేవాలయ ఖాతాల్లోకి చేరాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఈవోలే స్వయంగా వాటిని తీసుకుంటున్నట్టు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ఇక కొందరైతే ఏకంగా క్యాష్‌బుక్‌లో ఎంటర్ చేసిన కంప్యూటర్, ల్యాప్‌టాప్, సీసీ కెమెరాల వంటి సామాగ్రిని తమ సొంత ఇళ్ల వద్ద వాడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని ఒక శక్తి దేవాలయంలో ఇదే తరహాలో వస్తువులను ఈవో తమ సొంత ఇంటికి వాడుకుంటున్నారని దేవాదాయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఈవోలలో ఈ కార్యనిర్వహణాధికారి కోట్లకు పడగలెత్తి ఆదాయంలో మొదటివరుసలో ఉంటాడన్న చర్చ జరుగుతోంది. కొందరు ఈవోలు ఇంట్లో వంట మానేసి సకుటుంబసపరివారంగా దేవాలయం ఖర్చులతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు టిఫిన్లు, భోజనాలు ఆలయంలోనే పూర్తి చేసుకుంటున్నారని, ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని దేవాదాయశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు.
రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలకు పనిచేస్తున్న ఈవోలకు అదనంగా మరో రెండుమూడు దేవాలయాల బాధ్యతలు ఉన్నాయి. ఇందులో కొందరు తాము ఇన్చార్జిగా ఉన్న దేవాలయాలకు వెళ్లే రోజులే తక్కువ. ఒక ఈవో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న దేవాలయానికి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. నెలలో ఐదారుసార్లు వెళ్లినట్ట్లు రికార్డులోరాసుకుని అందు కు తగినట్లుగా బిల్లులు డ్రా చేస్తున్నాడు.
హైదరాబాద్‌లో బోనాలు వైభవంగా జరిగే అమ్మవారి ఆలయానికి గతంలో ఈవోగా పనిచేసిన అధికారిపై బంగారం, వెండి మాయం విషయంలో పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ అధికారి అక్కడ నుంచి సిద్దిపేట జిల్లాలో భక్తులు కొంగుబంగారంగా కొలిచే ఓ ప్రముఖ దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్నారు. మేకప్‌కిట్ కోసమే తాను పనిచేసే ప్రతీ ఆలయం నుంచి సుమారు రూ.30వేలకు పైగా డ్రా చేస్తారని ఆ అధికారిపై దేవాదాయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆలయాల ఈవోలు అధికార పార్టీ నేతల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఓఇద్దరు ఈవోలు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండగా.. పదవీకాలం పొడగించడానికి పలువురు ఎమ్మెల్యేల నుంచి లేఖలు తీసుకుని మంత్రిని కలిసి అభ్యర్థిస్తున్నట్టు తెలిసింది. ప్రసాదం, చీరలు, బంగారు వస్తువులను అధికారపార్టీ నేతలకు, ముఖ్యనేత క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి ముడుపులుగా ముట్టజెప్తూ తమ పనులు వెళ్లదీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.