CMRF | కరీంనగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిస్సహాయులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారా? ఓ ముఠాగా ఏర్పడి, అసలైన బాధితులకు అందజేయాల్సిన చెక్కులను అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారా? ఒకరి చెక్కులను మరొకరి ఖాతాలో వేసుకొని, ఆ డబ్బులను పంచుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో వెలుగు చూసిన వ్యవహారం అందుకు నిలువెత్తు నిదర్శనం. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కే రవి తన తండ్రిని ఓ ప్రైవేట్ దవాఖానలో గతంలో చికిత్స చేయించారు. అందుకు అయిన ఖర్చులను ఇవ్వాలని కోరుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల క్రితం అతని పేరిట రూ.60 వేల చెక్కు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి చెక్కును తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆ చెక్కును అదే మండలం రహీంఖాన్ పేటకు చెందిన కే రవి అనే పేరున్న వ్యక్తి ఖాతాలో జమచేసి, సొమ్ము చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారు పంచుకున్నట్టు సమాచారం. వేరే వ్యక్తి చెక్కును తన ఖాతాలో ఎందుకు వేస్తున్నారని సదరు వ్యక్తి ప్రశ్నిస్తే.. ‘అంతా మేం చూసుకుంటాం. మీకెందుకు’ అని చెప్పినట్టు తెలిసింది. చెక్కు వచ్చిన విషయం రెండు రోజుల క్రితం అసలు బాధితుడికి తెలియగా అక్రమార్కుల విషయం బయటపడింది.
ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కారణంగానే ఈ వ్యవహారం బయటకు పొక్కింది. కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు పూర్తి ఇంటిపేరు లేకుండా వస్తాయి. ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు ఈ దందాకు తెరలేపారు. ఈ వ్యవహారమంతా పకడ్బందీగా జరుగుతున్నది. ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆ నాయకులు ముందుగా తెలుసుకుంటున్నారు. అదే సమయంలో సంబంధిత వ్యక్తిని పోలిన పేరున్న మరొకరిని ముందుగానే వెతుక్కుంటున్నారు. చెక్కు రాగానే దాన్ని బాధితులకు అప్పగిస్తామంటూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తీసుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ వ్యవహారం నాలుగైదు నెలులుగా జరుగుతున్నట్టు అధికార పార్టీలో చర్చ నడుస్తున్నది. ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక వర్గం నడుపుతున్న ఈ అక్రమ దందాను మరో వర్గం వారు వెలుగులోకి తెచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం ఇచ్చామని ఒక వర్గం చెబుతుండగా.. పోలీసులు మాత్రం తమ దృష్టికి రాలేదని అంటున్నారు. దీంతో స్థానిక పోలీసులు స్పందించకపోతే.. ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరో వర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ దందా బయటకు పొక్కకుండా ఉంచేందుకు పలువురు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారని సమాచారం.
ఈ అక్రమ దందా గురించి లోతుగా విచారిస్తే భారీ కుంభకోణం బయట పడవచ్చన్న చర్చ కొనసాగుతున్నది. పలువురు అధికార నేతలు దీన్ని ప్రధాన వృత్తిగా మార్చుకున్నారని తెలుస్తున్నది. ఈ తరహాలో పలు మండలాల్లో దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కొల్లగొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికార యంత్రాగం విచారణ జరిపిస్తుందా? లేదా అన్నది చూడాలి.