ఖైరతాబాద్, జూలై 8: నిరుద్యోగులారా ఆ త్మహత్యలు చేసుకోవద్దు.. కొట్లాది కొలువులు సాధించండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో పాలక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలో సోమవారం సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగుల సమస్యలు-పరిష్కారాలు-ప్రభుత్వం ముందున్న డిమాండ్లు’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్టు వీ శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్ర ముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పం చుకున్నారు. నిరుద్యోగమనే నినాదంతోనే తె లంగాణ ఉద్యమం ముందుకు సాగిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. కానీ ఈ సమస్య తీరలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ వారు ఆందోళన చేస్తూనే ఉన్నారని చె ప్పారు. ప్రభుత్వ కొలువుల్లో ఉన్న ఎందరికో లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తున్నారని, ఈ వేతనాలను షేర్ చేసి మరికొంత మందికి అవకాశం కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా నిరుద్యోగల సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు. వాటన్నింటినీ నేరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉన్నదని తెలిపారు.
సర్కారు దిగొచ్చేదాకా పోరాటం: గెల్లు
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేశారని గుర్తుచేశారు. ఇటీవల భర్తీ చేసిన పోస్టులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన తమ పోరాటాలు ఆగవని తేల్చి చెప్పారు.
30 లక్షల మందితో చెలగాటం: గాలి
రేవంత్‌రెడ్డి సర్కారు 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ విమర్శించారు. ఒకవైపు ఉద్యోగాలను భర్తీ చేయకుండా, మరోవైపు ఉన్న ఉద్యోగాలను కుదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 నిష్పత్తి పాటిస్తామని, పోస్టుల సంఖ్య పెంచుతామని స్వయంగా అసెంబ్లీ సా క్షిగా చెప్పిన భట్టి విక్రమార్క ఇప్పుడేమో మా ట దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు న్యాయం చేయని సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మభ్యపెట్టిన రాహుల్‌గాంధీని నిలదీసేందుకు చలో ఢీల్లీ కార్యక్రమాన్ని చేపట్టాలని, అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు.
పెరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు: విఠల్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, ఇది పూర్తిగా సర్కా రు వైఫల్యమేనని తెలంగాణ విఠల్ తీవ్రంగా విమర్శించారు. గురుకుల అభ్యర్థులు, గర్భిణులు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఇంటికి వెళితే కనీసం వారిపై కన్నెత్తి చూడటం లేదని తెలిపారు. ఇక ప్రజా ప్రభు త్వం ఎలా నడుపుతారని ప్రశ్నించారు. ప్రభు త్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకు, న్యా యమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు మేధావులతో కలిసి నాన్ పొలిటికల్ కమిటీని వేసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.
ముఖం చాటేసిన నేతల వైఖరిపై నిరసన
నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే తమ జీవితాశయమని చెప్పుకున్న కొందరు ప్రతినిధులు నిరుద్యోగుల రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరుకాకపోవడాన్ని నిరుద్యోగ యువకులు తీవ్రంగా తప్పుపట్టారు. సమావేశానికి హాజరై నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని నిర్వాహకులు ఆహ్వానం పంపితే కొందరు ముఖం చాటేశారు. వారికి కేటాయించిన చైర్లపై పేర్లు రాసి ఉంచి నిరసన తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర ళి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీ కాంగ్రెస్ స్పో క్స్ పర్సన్ డాక్టర్ కొనగాల మహేశ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ పేర్లను రాసి వారి నిరసన తెలిపారు.
నిరుద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు సంజీవ్‌నాయక్
నిరుద్యోగ కొలువుల ఆశలపై కాంగ్రెస్ సర్కారు నీళ్లు చల్లుతుందని సేవాలాల్‌సేన అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్ ధ్వజమెత్తారు. వేర్వేరు పరీక్షల నడుమ గడువు ఇవ్వకుండా విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని తెలిపారు. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నడుస్తాయని, ఆగస్టు 7, 8లో గ్రూప్-2 పరీక్షలు పెట్టారని, అక్టోబర్ 24 నుంచి 29 వరకు గ్రూప్-1 మెయిన్స్ పెడుతున్నారని, తిరిగి నవంబర్ 17, 18న గ్రూప్-3 ఉంటుందని తెలిపారు. దీంతో ఒత్తిడిలో నిరుద్యోగులు ఎలా ఉద్యోగాలు పొందుతారని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులపై నిర్బంధాలు విధించడం అమానుషమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ముఖం చాటేసిన రాహుల్‌గాంధీతో నిరుద్యోగులు తాడోపేడో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ జనసభ, విద్యార్ధి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాంయాదవ్, సామాజికవేత్త మురళీ మనోహర్, బీజేవైఎం నేత మహేశ్, నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రతినిధులు జనార్ధన్, శరత్, పలువురు డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థి, నిరుద్యోగులు పాల్గొన్నారు.