Solar Plant | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్.. ప్రత్యేకించి రైతులు పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే స్కీం. ఈ స్కీంలో రైతులను పక్కనపెట్టి ఆంధ్రా కంపెనీకి ప్లాంట్లు కట్టబెట్టేందుకు టీజీ రెడ్కో అధికారులు పావులు కదుపుతున్నారు. ఏపీలోని కాకినాడకు చెందిన ప్రైవేట్ కంపెనీకి 2,400 మెగావాట్ల ప్లాంట్లను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది బినామీ కంపెనీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీ వెనుక అదానీ సహా మరికొన్ని కంపెనీలున్నట్టు అనుమానాలున్నాయి. కొందరు ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. రైతుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని పూర్తిగా ఏపీ కంపెనీకి గంపగుత్తగా అప్పగించడంపై రైతులు అభ్యంతరం చెప్తున్నారు.
ఎకరాకు రూ.15వేలు… ఉద్యోగం..
సదరు ఆంధ్రా కంపెనీ.. రైతులను మభ్యపెట్టి స్థలాలను లీజుకు తీసుకుంటున్నది. ఎకరాకు నెలకు రూ. 15వేలు ఇస్తాం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తామంటూ అమాయక రైతులను బుట్టలో వేసుకుంటున్నది. కంపెనీ ప్రయోజనాల కోసం రెడ్కో అధికారులు అనేకసార్లు సడలింపులు ఇచ్చారు. అయినా కంపెనీ రూ. 17కోట్ల డిపాజిట్ చెల్లించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు పలువురు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది.
రైతులకు ఇవ్వకుండా జాప్యం..
పీఎం కుసుమ్ స్కీంలో సోలార్ ప్లాంట్లకు మొత్తంగా 4,364 దరఖాస్తులొచ్చాయి. ప్రైవేట్ కంపెనీల కోసం రెడ్‌కార్పెట్ పరుస్తున్న టీజీ రెడ్కో రైతులను మాత్రం ప్రోత్సహించడంలేదు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలంలోని కేతేపల్లికి చెందిన రైతు కేతావత్ లష్కర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను సొంత స్థలంలో 0.5 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నా.. ఇంతవరకు టీజీ రెడ్కో అప్రూవల్ ఇవ్వలేదని మొరపెట్టుకున్నాడు. ప్రైవేట్ కంపెనీ రైతుల భూమి లీజుకు తీసుకుంటున్నదని, కంపెనీకి కాకుండా తనకే ప్లాంట్‌ను కేటాయించాలని విజ్ఞప్తి చేశాడు.
ట్రాన్స్మిషన్లైన్లు ప్రభుత్వమే వేయాలి
సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుపై ఇప్పటికీ చాలా సందేహాలున్నాయి. అనుమానాలను రెడ్కో అధికారులు నివృత్తి చేయాలి. కోట్లకు కోట్లు పెట్టి రైతులు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోలేరు. బ్యాంకులు రుణాలివ్వడంలేదు. ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి, 90శాతం లోన్ ఇప్పించాలి. ప్లాంట్ నుంచి సబ్‌స్టేషన్ వరకు ట్రాన్స్మిషన్ లైన్లను ప్రభుత్వమే ఉచితంగా వేయాలి. రైతును ప్రోత్సహించేందుకు సబ్సిడీ మంజూరు చేయాలి.
– బుర్రా అశోక్‌కుమార్, సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడుట్రైకార్