హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే ఆరోపణలు చేశారని, అందాల పోటీల నిర్వహణతో ఒక రూపాయి అయినా తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతితో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. అందాల పోటీలను ఎందుకు పెట్టారని నిలదీశారు. ములుగు జిల్లాలో 200 ఎకరాల వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోతే పట్టించుకోని ప్రభుత్వం, ప్రజల సొమ్మును అందగత్తెల కోసం ఖర్చుపెట్టడమేమిటని దుయ్యబట్టారు.