Congress | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) ; ‘మార్పు’ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలకు తనదైన ‘మార్క్’ చూపించింది. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావడం మరచి, స్వార్థపూరిత పాలనకు తెరతీసిందనే విమర్శలు ఎదుర్కొంటున్నది. హామీలు అమలు కాకపోగా స్కాములకు తెరతీసిందనే ఆరోపణలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. కాదేదీ అనర్హం అన్నట్టుగా బూడిద నుంచి భూముల వరకు అన్నింటిలోనూ కాంగ్రెస్ తన పనితనం చూపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమాలతో మొదలైన హస్తం పార్టీ పాలనలో నెలకో వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందులో చాలా కుంభకోణాల తీగలు లాగితే చివరికి ‘బిగ్ బ్రదర్స్’ డొంకలు కదలడం చూస్తే కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఏడాదిలో కుంభకోణాల ఆరోపణలు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నెంబరు 92లో ఉన్న అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలతోపాటు ఎన్వోసీలు తెచ్చుకుంటామంటూ రైతులతో కొందరు ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరాకు రూ.10లక్షల నగదుతోపాటు అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు వెయ్యి గజాల చొప్పున జాగా ఇస్తామని రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. బిగ్ బ్రదర్స్ సమీప బంధువుకు చెందిన కంపెనీ పేరుతో ఏజీపీఏ చేయాలని చెప్పారు. రూ.2వేల కోట్లకుపైగా విలువైన భూములను కొట్టేసేందుకు ప్రయత్నించారు.
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఖమ్మంకు ఫ్లైయాష్ తరలింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లారీలో 32 టన్నుల ఫ్లైయాష్‌తో రోజుకు 300 లారీల్లో తరలించాల్సి ఉంటుంది. కానీ రెట్టింపు స్థాయిలో 50-65టన్నుల వరకు ఓవర్‌లోడ్‌తో రవాణా జరిగినట్టు తెలుస్తున్నది. ఓవర్‌లోడ్‌తో ఒక్కో ట్రిప్పులో రూ.25వేల వరకు మిగిలినట్టు చెప్పారు. రోజుకు రూ. 50 లక్షల చొప్పున దాదాపు రూ. 100కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని, అంతా ఓ మంత్రి జేబులోకి వెళ్లిందని ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం కొత్త లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు కొన్ని కంపెనీలకు అనుమతులు జారీ చేసింది. ప్రజాదరణ పొందిన బ్రాండ్లను కనిపించకుండా చేసి, కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఏటా రూ.5వేల కోట్ల వరకు కమీషన్లు చేతులు మారేలా ప్లాన్ వేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే ఎవరో ‘పెద్దలు’ ఈ దోపిడీకి తెరతీశారని ఆరోపణలు వచ్చాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖరీదైన వాచీల అక్రమ రవాణా కేసులో ఇరుక్కున్నారు. చెన్నై విమానాశ్రమంలో ఈ ఫిబ్రవరి 5న కస్టమ్స్ అధికారులు రెండు లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. విచారణలో మంత్రి పొంగులేటి కొడుకు కోసమే తెచ్చినట్టు చెప్పారు. దీంతో కస్టమ్స్ అధికారులు మంత్రి కొడుకును విచారించారు. ఈ స్మగ్లింగ్ రాకెట్ రూ.100కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంటును మార్చారు. రీజినల్ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని 189కిలోమీటర్ల నుంచి 194కిలోమీటర్లకు పెంచారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో మాడ్గుల, మన్నెగూడ, అమన్‌గల్, కడ్తాల్ ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దల సన్నిహితుల భూములకు ధరలు పెరిగేలా ఈ మార్పులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వం రూ.1.5లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మూసీ పునర్జీవం పెద్ద కుంభకోణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనాథ పిల్లల కోసం నిజాంల కాలంలో సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విక్టోరియా హోమ్‌లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. బ్రిటన్ మహారాణి క్వీన్ విక్టోరియా పేరుతో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఏర్పాటు చేసిన ఈ హోమ్‌లో విలువైన సామాగ్రిని నిర్వాహకులు స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ఫార్మాసిటీని రద్దుచేసి వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నించడం వెనుక పెద్ద మతలబే ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం అల్లుడి ఫార్మా పరిశ్రమ అక్కడ ఏర్పాటు కానున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పౌరసరఫరాల శాఖ గోదాముల్లో నిల్వ ఉన్న 35 లక్షల టన్నుల బియ్యం ఖాళీ చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. క్వింటాలు రూ. 2,007కు కోట్ చేస్తే మిల్లర్ల నుంచి రూ.2,223 వసూలు చేశారని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. రూ. 220 చొప్పున మొత్తం రూ.750 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించాయి. ఇక గురుకులాలు, అంగన్వాడీలు, మధ్యహ్నభోజన పథకానికి 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం సరఫరా కిలో రూ.57 చొప్పున టెండర్లు ఖరారు చేశారు. బహిరంగ మారెట్లో రూ. 42-45 మధ్య దొరుకుతున్నదని, అదనంగా రూ.15 చొప్పున 2.20 లక్షల టన్నులకు రూ.330 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని విపక్షాల నేతలు ఆరోపించారు. రెండూ కలిపి రూ.1100 కోట్లు.
భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నా, లేఔట్లు అనుమతులు ఇవ్వాలన్నా ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్డర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంస్థల నుంచి చదరపు అడుగుకు, చదరపు గజానికి వసూలు చేస్తున్నారని రియర్ వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అమృత్ 2.o టెండర్లలో ఎలాంటి అర్హత లేకపోయినా సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి చెందిన శోధా కంపెనీకి టెండర్లను కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేవలం రూ.2 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బావమరిదికి అప్పనంగా రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా మార్పు నినాదంతోఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనకు మార్కులు వేయాలంటే తనదైన మార్కు చూపించుకుంటున్న కాంగ్రెస్ పాలనకు అవినీతి రిమార్కులే వేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పాలసీ పేరుతో ఇసుక సరఫరాను నిలిపివేసింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న రీచ్‌ల నుంచి పెద్దఎత్తున ఇసుక అక్రమ దందా సాగింది. ఈ దందా వెనుక ఓ మంత్రి పీఏతోపాటు ఉత్తర తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేలా స్వచ్ఛ్బయోతో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీలో సీఎం సోదరుడు అనుముల జగదీశ్వర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. అప్పటికి నాలుగు నెలల కిందటే కంపెనీ రిజిస్టర్ అయింది. షేర్ క్యాపిటల్ రూ.10లక్షలు మాత్రమే ఉన్న కంపెనీ ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టడం ఎలా సాధ్యమనే విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్ పాలనలో కుంభకోణ ఆరోపణలు