మానవపాడు, నవంబర్ 13 : రన్నింగ్‌లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్‌కు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో 130 మంది ప్రయాణికులు ఎక్కారు. మానవపాడు మండలం మద్దూరు స్టేజీ వద్దకు వెళ్లగానే బస్సు బాడీ వెనుక టైర్లకు రాసుకొని ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో అప్రమత్తమైన డ్రైవర్ సత్యారెడ్డి బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. భయంతో ప్రయాణికులు కిందకు దిగారు. బస్సులో ఉన్న కార్బన్‌డైఆక్సైడ్ సిలిండర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మద్దూరు గ్రామస్థులు సమీపంలోని ఆర్డీఎస్ కాల్వలో నీటితో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఓవర్‌లోడ్ కారణంగా పొగలు వచ్చాయని డ్రైవర్ సత్యారెడ్డి తెలిపారు.