CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్‌కోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. శనివారం శాసనసభలో విద్యుత్ మీటర్ల అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఈ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు బిగించకపోతే అగ్రిమెంట్‌ను ఉల్లంఘించామని కేంద్ర ప్రభుత్వం డిస్కంలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడమీద కత్తి వేలాడుతున్నది. ఈ ఒప్పందాలు రాష్ర్టానికి గుదిబండగా మారాయి. తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్‌శాఖకు విధిలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లోనే వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది’ అని స్పష్టం చేశారు.
విద్యుత్ మీటర్లపై 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉదయ్ పథకంలో చేరుతూ గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని తెలిపారు. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద 2017 జూన్ 30లోపు, ఫీడర్ చానల్వద్ద, 500 యూని ట్లు వినియోగించే వినియోగదారుల వద్ద 2018 డిసెంబర్ 31 వరకు, 200 యూనిట్ల వినియోగదారుల వద్ద 2019లో స్మార్ట్‌మీటర్లు పెడతారని తాను చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఒప్పందం, పరిస్థితులను సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. వ్యవసాయ పంపుసెట్ల వద్ద వీళ్లు(బీఆర్ఎస్) మీటర్లు పెడతారని తాను మాట్లాడానా అని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద 100శాతం మీటర్లు పెడితే.. వీటి కింద వ్యవసాయ కనెక్షన్లు ఉండవా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్ వెళ్లే డిస్ట్రిబ్యూషన్ దగ్గర పెడుతున్నారని, విడివిడిగా వ్యవసాయ వినియోగదారుల వద్ద మీటర్లు పెడతలేరని తెలిపారు. ఈ ఒప్పందాన్ని తాము వ్యతిరేకించామని, తిరగబడ్డమని, 30వేల కోట్లు వదులుకున్నామని బీఆర్ఎస్ గొప్పలు చెబుతున్నదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్నలాంటి వారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ అన్న మాటలకు ఆయన స్పందించారు. రాష్ర్టాల్లో అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ గుజరాత్, యూపీ, బీహార్‌కు ఏ విధంగా నిధులు ఇస్తున్నారో తెలంగాణకు కూడా అదే స్థాయిలో నిధులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. పెద్దన్న మాదిరిగా రాష్ర్టాలపై వివక్ష చూపొద్దని కోరినట్టు చెప్పారు.
అక్బరుద్దీన్ ఓవైసీని డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం ప్రకటించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ నుం చి పోటీ చేయాలని షరతు విధించారు. నామినేషన్ పత్రంపై సంతకం చేస్తే గెలిపించుకొని వస్తానని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన అక్బరుద్దీన్.. తాను జీవితాంతం ఎంఐఎంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక ఓల్డ్‌సిటీకి మెట్రో విస్తరణపై అక్బరుద్దీన్ అడిగిన మరో ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ… ‘ఓల్డ్సిటీకీ మెట్రో విస్తరణ చేయాల్సిందే.. లేదంటే చర్లపల్లి, లేదా చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వస్తుందని ఎల్అండ్టీ సంస్థకు స్పష్టం చేశాను.’ అని తెలిపారు.