హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బిల్లుల కోసం ఆందోళన చేసిన చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టు మారింది. బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవల కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళన చేసిన తర్వాత బిల్లుల మంజూరు పూర్తిగా నిలిచిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ శాఖల్లో పనిచేస్తున్న తమ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని సివిల్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పనులు పూర్తికాగానే బిల్లులు త్వరగా వచ్చేవని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మండిపడుతున్నారు.
బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని చెప్తున్నారు. వివిధ శాఖల్లో దాదాపు 6000 మంది చిన్న కాంట్రాక్టర్లు పనులు చేస్తుండగా.. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పురపాలక, నీటిపారుదల, జలమంలి, ఆర్డబ్ల్యూఎస్ వంటి శాఖల పరిధిలోని సివిల్ పనులకు రూ.10 లక్షలలోపు గల బిల్లులు సుమారు రూ.1000 కోట్లకుపైగా పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తున్నది. కాంట్రాక్టర్ల సంఘం తరపున చాలాసార్లు అధికారులకు, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదిలేక ఇటీవల పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆర్థికశాఖ మంత్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చాంబర్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
అప్పటి నుంచి బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిపివేసినట్టు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. పెండింగ్ బిల్లులు, చెల్లింపుల వివరాలు కోరుతూ ఇటీవల కాంట్రాక్టర్ల సంఘం సమాచార హక్కు చట్టం కింద పే అండ్ అకౌంట్స్ విభాగాన్ని సమాచారం కోరగా, సమాచారం ఇచ్చేందుకు వారు నిరాకరించినట్టు కాంట్రాక్టర్లు తెలిపారు. మంత్రుల అనుచరులుగా ఉన్నవారికి మాత్రమే బిల్లులు ఇస్తున్నారని, మిగిలినవారికి ఇవ్వడంలేదని చెప్పారు.
బడా కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చిన్న కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఉదాహరణకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, మంచినిటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీగోడలు వంటి నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు ఇంకా రూ.700కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని, కానీ వాటికి రంగులు వేసిన ఒకేఒక బడా ఏజెన్సీకి ప్రభుత్వం ఏకంగా రూ.900కోట్లు చెల్లించిందని తెలిపారు.
చిన్న కాంట్రాక్టర్ల నుంచి వారికి పెద్దగా కమీషన్లు రావని, బడా కంట్రాక్టర్కు చెందిన పెద్ద బిల్లులైతే వారికి పెద్ద మొత్తంలో కమీషన్లు ముడుతాయనే ఉద్దేశంతోనే ఆ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బిల్లులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికారులు తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారని, బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఎంత పెద్ద బిల్లులైనా చాటుమాటుగా మంజూరు చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.