చిక్కడపల్లి, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం కూడా నిరుద్యోగుల నిరసనలు కొనసాగాయి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో నిరుద్యోగ యువత నిరసనలకు దిగుతున్నది. ఆదివారం రాత్రి అశోక్‌నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ‘వియ్ వాంట్ జస్టిస్, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అని నినాదాలు చేస్తూ అశోక్‌నగర్ చౌరస్తాలో ర్యాలీగా వస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోబోయారు.
నిరసనగా వైట్‌హౌస్ స్టడీ హాలు చౌరస్తా వద్ద నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనను భగ్నం చేయడానికి పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించినా నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ధర్నాకు దిగారు. ఆ తర్వాత నిరుద్యోగులు కయ్య వెంకటేశ్, ఇంద్రానాయక్, రవి రాథోడ్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగులు ఆందోళనను అడ్డుకోవడానికి అశోక్‌నగర్ చౌరస్తా, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అయినా నిరుద్యోగులు మాత్రం తమ నిరసనను ఆపకుండా కొనసాగించడం విశేషం.

ఆగని ఆందోళనలు
ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరుద్యోగ యువత హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలకు దిగుతున్నది. అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో మెరుపు ర్యాలీలు తీస్తూ నిరుద్యోగులు ఆందోళనలకు దిగుతున్నారు. అందరికీ ఉద్యోగావకాశాలు ఇవ్వలేమన్న మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటనతో మరింత ఆగ్రహానికి గురైన యువత రోజుకో చోట వరుస నిరసనలు చేపడుతున్నది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఈ ఆందోళనలు కొనసాగిస్తామని నిరుద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు.
