SLBC Tunnel | మహబూబ్‌నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి )/అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్‌ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు కూడా చివరి దశకు చేరాయి. ఇప్పటివరకు లోపలికి వెళ్లేందుకు నానాఇబ్బందులు పడిన రెస్క్యూ సిబ్బందికి టీబీఎం అడ్డు తొలగిపోవడంతో లోపలికి వెళ్లేందుకు సులువుగా మారింది. అధికార యంత్రాంగం హిటాచీని లోపలికి పంపించి మిషన్ భాగాలను పక్కకు తొలగించారు. రాత్రి నుంచి బురదను కూడా హిటాచీతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించే అవకాశం ఉన్నది. పదిరోజుల నుంచి రెస్క్యూ సిబ్బంది మాత్రమే ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టంగా బురద తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హిటాచీని లోపలికి పంపించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కార్మికుల ఆచూకీ కోసం జీపీఆర్ సర్వే గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరిపినా.. అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదని తెలిసింది. ఇనుప పరికరాలు మాత్రమే కనిపించినట్టు సమాచారం.
ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో సోమవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌అలీ, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న.. హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కన్వేయర్ బెల్ట్ మరమ్మతు పనులు వేగవంతం చేశామని, ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని, ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యల్లో ఎదురువుతున్న సమస్యలపై 12 సంస్థల బృందాల అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. నేటి నుంచి పనులు స్వీడ్ అందుకోనున్నట్టు తెలిపారు.
తొమ్మిది రోజులపాటు హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు, మీడియా ప్రతినిధులు పదోరోజు కనిపించలేదు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వపరంగా మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎవరో ఒకరు ఘటనా స్థలంలో ఉండి రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్షలు జరపడం, మీడియాతో ప్రెస్మీట్లు పెడుతూ హడావుడి చేసేవారు. కానీ, పదోరోజు అక్కడికి ఎవరూ రాలేదు. అధికారులే రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్షలు జరిపి సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చివెళ్లాక మీడియా, ప్రభుత్వ పెద్దల హడావుడి తగ్గింది.
ప్రమాద ఘటన ప్రదేశంలో ప్రస్తుతం నిమిషానికి 3 నుంచి 4 వేల లీటర్ల నీటి ఊట టన్నెల్లోకి వస్తున్నది అధికారులు తెలిపారు. సొరంగం వెళ్లిన ప్రాంతం మల్లెలతీర్థం వరకు ఉంటుందని సర్వే బృందాలు పేర్కొన్నాయి. టన్నెల్ నిర్మాణం భూమి పైనుంచి లోపలికి 650 మీటర్ల వరకు ఉండగా, టన్నెల్ పైన 450 మీటర్ల ఎత్తు నుంచి నీటి ఊట టన్నెల్లోకి వస్తుందని సర్వే బృందాలు అంచనా వేస్తున్నాయి.