SLBC Tunnel | నాగర్‌కర్నూల్, మార్చి 8: ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌కు అంతుచిక్కడమే లేదు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. 15 రోజులైనా వారి జాడ ఇంకా కనిపించలేదు. ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాల్లోని దాదాపు 580 మందికిపైగా సభ్యులతో సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. నిపుణులు క్షుణ్నంగా టన్నెల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నా ఆపరేషన్ ఒక కొలిక్కి రావడంలేదు.
రాడార్ ద్వారా గుర్తించిన స్థానాల్లో శనివారం రెండుచోట్ల పూర్తిస్థాయిలో మట్టిని తొలగించినప్పటికీ కార్మికుల ఆచూకీ కనిపించలేదని తెలిసింది. కేరళ నుంచి రప్పించిన ప్రత్యేక జాగిలాలు సైతం కార్మికుల జాడను గుర్తించలేకపోయాయి. రాడార్ మిషన్ ద్వారా గుర్తించిన స్థలాన్నే జాగిలాలు సైతం గుర్తించినా స్పష్టత రాలేదని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. జాగిలాలు మరోసారి శనివారం ఉదయం సైతం వెళ్లినా ఫలితం మాత్రం శూన్యం.
ఇదేరోజు పెద్దసంఖ్యలో రెస్క్యూ బందాలు వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. టీబీఎంకింద శకలాల తొలగింపు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మద్రాస్ ఐఐటీ బృందంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం దక్కలేదు. మట్టి, మురదను తరలించేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేపడుతున్నా అది ఇంకా వినియోగంలోకి రాలేదు. ఎన్జీఆర్ఐ, జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కార్మికుల జాడను మాత్రం గుర్తించలేదు.
దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాద ఘటన జాతీయ విపత్తు అని, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సహాయ చర్యలను కొనసాగించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని చెప్పారు. శనివారం ఆయన టన్నెల్ వద్ద ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ వివరాలను తెలిపారు. అవాంతరాలను అధిగమిస్తూ వేగంగా ఆపరేషన్‌ను కొనసాగించాలని అధికారులకు సూచించారు. సొరంగంలో ఆక్సిజన్ స్థాయి లేక, నీరు అధికంగా ఊరడం, టీబీఎం లోహ శకలాలు, రాళ్లు, మట్టితో అడ్డంకిగా మారడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఈ నెల 11న మళ్లీ తాను టన్నెల్‌ను సందర్శించనున్నట్టు మంత్రి తెలిపారు.