కరకగూడెం/కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండ లం ఏజెన్సీ ప్రాంతం గురువారం తెల్లవారుజామున తుపాకీల మోతలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పచ్చని చెట్లపై రక్తపు మరకలు చిందించింది. రఘునాథపాలెం, మోతే, తాటిగూడెం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య జరిగిన ఎ దురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హ తమయ్యారు.
భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు కథ నం ప్రకారం.. ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. గ్రేహౌండ్స్ బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన గ్రేహౌండ్స్ బలగా లు ఎదురుకాల్పులకు దిగాయి. కాల్పుల విరమణ తర్వాత ఘటనా స్థలాన్ని అధీనంలోకి తీసుకున్న గ్రేహౌండ్స్ బలగాలు.. ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాయి.
మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉ న్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, మణుగూ రు ఏరియా కార్యదర్శి లచ్చన్న దంపతులు కూ డా మృతి చెందారు. వీరిపై రివార్డులు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకులు 2, ఎస్ఎల్ఆర్ 1, 303 రైఫిల్ 1, పిస్టల్ 1, మ్యాగజైన్‌తోపాటు లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించామని తెలిపారు. ఒక మావోయిస్టు పారిపోయినట్టు పేర్కొన్నారు.
రఘునాథపాలెం ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యలకు త్వరలోనే నె త్తుటి బాకీ తీర్చుకుంటామని హెచ్చరిస్తూ మా వోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో గురువారం లేఖ విడుదలైంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కామ్రేడ్లతోపాటు ఓ గ్రామస్థుడు చనిపోయినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో రాయిగూడెం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం డివిజన్ కమిటీ సభ్యుడు లచ్చన్న, ఆయన సతీమణి తులసి అలియాస్ పూనెం లక్కీ, పాల్వంచ-మణుగూరు ఏరియా కమిటీ కమాండర్ రాము, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోమటిపల్లికి చెందిన పార్టీ సభ్యురాలు కోసి, గంగాల్, పార్టీ సీనియర్ సభ్యుడు, బొట్టెంకు చెందిన దుర్గేశ్ అమరులయ్యారని తెలిపారు. ఈ నెల 9న బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణకు చెందిన మావోయిస్టు కార్యకర్తలు, అధినాయకత్వం జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ జితేందర్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతె గ్రామ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టు కార్యకర్తలందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం కల్పించే పునరావాస పథకం ద్వారా ప్రయోజనం పొందాలని డీజీపీ కోరారు.
రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ర్టాల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారు. గురువారం ఒక్కరోజే భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాది జూలై 26న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరతోగు-రంగాపురం మధ్యలో జరిగిన ఎన్కౌంటర్లో నల్లమూరి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 9 మంది మావోయిస్టులు హతమైన ఘటన జరిగిన రెండు రోజుల్లోనే తెలంగాణలో మరో ఆరుగురు మావోయిస్టులను పోలీసు బలగాలు మట్టుబెట్టాయి. కేసీఆర్ ప్రభుత్వం మావోయిస్టుల కుటుంబాలకు సైతం రైతుబంధు, రైతుబీమా, లొంగిపోయిన వారికి రివార్డులు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో గడిచిన పదేండ్లలో 600 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు.