హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావును విచారణకు పిలిచారు. ఈ మేరకు గురువారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదే కేసులో ఇటీవల హరీశ్‌రావును విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 243/2024 యూ/సెక్షన్ 166, 409, 427, 201, 120 (బి) ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ; సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్; సెక్షన్ 65, 66, 66 (ఎఫ్)(1)(బి)(2) 70 ఆఫ్ ఐటీయాక్టు కింద స్పెషల్ సిట్ విచారణాధికారి పీ వెంకటగిరి పేరుతో నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు మీకు తెలుసునని అందుకే మిమ్మల్ని వ్యక్తిగతంగా విచారించడం అవసరమని విచారణాధికారి భావిస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.
రాకపోతే చర్యలు తప్పవు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చామని, చట్టబద్ధమైన కారణం లేకుండా ఈ నోటీసును పాటించడంలో విఫలమైతే (విచారణకు హాజరుకాకపోతే) చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని గమనించాలని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావును సుమారు 7 గంటలపాటు విచారించిన అధికారులు, మళ్లీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంలో ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి కనిపిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హరీశ్‌రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్‌కు నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విచారణలతో వేధింపులు..
కేటీఆర్ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణల పేరుతో వరుసగా వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మూడుసార్లు ఏసీబీ అధికారుల విచారణను కేటీఆర్ ఎదుర్కొన్నారు. మూడుసార్లూ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తిగా వివరణ ఇచ్చారు. ఆ కేసులో కేటీఆర్ అరెస్టు అసాధ్యమని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. తన పంతం నెగ్గించుకునేందుకు మళ్లీ ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్‌తో నోటీసులు ఇప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నాడు ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్ ఫోన్లు కూడా ఏసీబీ అడగటం పలువిమర్శలకు తావిచ్చింది. దీంతో తన ఫోన్లు ఎందుకివ్వాలి? వ్యక్తిగత గోప్యతకు భంగం కాదా? అంటూ కేటీఆర్ ఏసీబీకి బహిరంగంగా చెప్పారు. డాక్యుమెంట్ విచారణకు ఫోన్‌తో ఏం సంబంధం? అని నిలదీశారు. వ్యక్తిగత గోప్యత ప్రాథమికహక్కుగా సుప్రీంకోర్టు అభివర్ణించినట్టు గుర్తుచేశారు. తన ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి ఇవ్వబోనని తేల్చి చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే 14 కేసులు పెట్టినట్లు కేటీఆర్ చెప్పారు. కాగా, అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఈడీ విచారణను సైతం ఎదుర్కొన్నారు.
నేడు సిట్ విచారణకు కేటీఆర్
కేటీఆర్ శుక్రవారం సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి నార్సింగిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి, 9:30 గంటలలోపు తెలంగాణభవన్‌కు చేరుకుంటారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తారు.