హైదరాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం తో కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ముఖ్యంగా బొగ్గు స్కామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఇతర మంత్రులపై ఆరోపణలు వెల్లువెత్తడం, రాష్ట్రమంతటా ఈ స్కాంపైనే ప్రజల్లో చర్చ జరుగుతుండడం సర్కార్‌ను దిక్కు తోచకుండా చేస్తున్నది. దీనికి తోడు ప్రభుత్వ అవినీతిని కేటీఆర్, హరీశ్‌రావు ప్రజాక్షేత్రంలో ఎండగడుతుండడంతో మరింత ముప్పు తప్పదని గ్రహించిన రేవంత్‌రెడ్డి.. తనకు అలవాటైన రాజకీయ డైవర్షన్ డ్రామాకు మళ్లీ మొదలుపెట్టాడు. అందుకే రాష్ట్రంలో మరో చర్చకు తావు ఉండొద్దని పసలేని, పనికిరాని ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్లీ బయటికి తీసి వరుసగా హరీశ్‌రావుకు, కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి కక్షగట్టాడు.
కేటీఆర్, హరీశ్ టార్గెట్‌గా..
కేటీఆర్, హరీశ్‌రావులు కాంగ్రెస్ సర్కార్‌కు, ముఖ్యంగా రేవంత్‌రెడ్డికి కొరకరాని కొయ్యగా మారారు. హామీల ఎగవేతపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు కుంభకోణంలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం రేవంత్‌రెడ్డికి ఎంతమాత్రం మింగుడుపడటం లేదు. దీంతో కంట్లో నలుసుగా మారిన ఆ ఇద్దర్ని సైలెంట్ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత మొత్తం దెబ్బకి తుడిచిపెట్టుకు పోయే ప్లాన్ వేసినట్లు తెలిసింది.
ఏ పాచిక వేస్తే రాష్ట్రంలో చర్చ డైవర్ట్ అవుతుందని ఆలోచించి.. హరీశ్‌రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసుతో ఒరిగేదేం లేదనే విషయం రేవంత్‌రెడ్డికి తెలియంది కాదని, కానీ డైవర్షన్ కోసమే ఈ నాటకాలకు తెరలేపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సోమవారం హరీశ్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం సిట్ విచారణకు హాజరైన హరీశ్‌రావు.. సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించి బయటకు వచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దీంతో మరింత డోస్ పెంచాలనుకున్నారు. తాజాగా గురువారం కేటీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలువడం వల్ల వారి ఆత్మైస్థెరాన్ని దెబ్బతీయడంతో పాటు క్యాడర్లో భయం నెలకొల్పాలనే కుట్రలకు తెరలేపారు.
బొగ్గు మరక తుడుచుకునేందుకే డ్రామా..
అవినీతి మరక మంచిది కాదనే ఈ విషయం సర్కార్ పెద్దలకు అవగతమైనట్టు ఉన్నది. ఇటీవల వెలుగులోకి వచ్చిన నైని బొగ్గు కుంభకోణంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు మరక అంటింది. ఈ స్కామ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది, మంత్రులు భట్టి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాత్రలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్క టెండర్ కోసం ఒకరిపై ఒకరు నీచంగా బురదజల్లుకోవడం అత్యంత హేయం. ఒకదశలో అన్ని వేళ్లు రేవంత్‌రెడ్డి వైపు చూపే పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లడం, సర్వత్రా ఈ కుంభకోణం సహా మంత్రుల మధ్య కొట్లాటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బొగ్గు మరకను తుడుచుకునేందుకు సర్కార్ నానాతంటాలు పడుతున్నది. ఇవేవీ కుదరకపోవడంతో బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు నోటీసులు పంపితే కుంభకోణం చర్చ నుంచి అందరూ డైవర్ట్ అవుతారని సర్కార్ పెద్దలు తలిచారు. కానీ అది బెడిసికొట్టింది. కుంభకోణం ప్రచారం మరింత ఎక్కువై మసి ఇంకా అంటుకుంటున్నది. దీంతో ఆందోళనకు గురైన సర్కార్ పెద్దలు ఇప్పుడు ఇంకొంత డోస్ పెంచి ఇప్పుడు కేటీఆర్‌కే నోటీసులు జారీ చేశారు. తద్వారా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు నెలకొని బొగ్గు కుంభకోణం అందులో కలిసిపోతుందనే కుట్రపూరిత ఆలోచనలు చేసినట్లుగా తెలిసింది.